స్వ‌తంత్ర భార‌త చ‌రిత్ర‌లో ప్ర‌త్యేక బ‌డ్జెట్

Special Budget in Independent Indian history
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెడుతున్న చివ‌రి పూర్తిస్థాయి బ‌డ్జెట్ స్వ‌తంత్ర భార‌త చ‌రిత్ర‌లోనే ప్ర‌త్యేక‌మైన‌ది. ఎందుకంటే జీఎస్టీ శ‌కంలో ఇది తొలి బ‌డ్జెట్. దేశంలో అతిపెద్ద ప‌న్నుల సంస్క‌ర‌ణ‌గా భావిస్తున్న వ‌స్తు సేవ‌ల ప‌న్ను అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌వేశ‌పెడుతున్న మొద‌టి బ‌డ్జెట్ కావ‌డంతో ప్ర‌పంచ దేశాలు సైతం ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నాయి. బ‌డ్జెట్ మౌలిక స్వ‌రూప స్వ‌భావాల‌పై జీఎస్టీ ప్ర‌భావం స్ప‌ష్టాతిస్ప‌ష్టంగా ఉన్న‌ట్టుతెలుస్తోంది. ఈ ఏడాది 8 రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఉపాధి క‌ల్ప‌న‌, వ్య‌వ‌సాయ ప్ర‌గ‌తి, పెట్టుబ‌డులకు ప్రోత్సాహ‌కాల‌కు బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త‌నిచ్చిన‌ట్టు స‌మాచారం. ఆర్థిక ప‌ద్దు నేప‌థ్యంలో బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న గురించి మ‌రిన్ని విశేషాలు…అస‌లు రాజ్యాంగంలో బ‌డ్జెట్ ప‌దమే లేదు.

వార్షిక ఆర్థిక ప‌త్రంగా పేర్కొన్నారు. వాడుక‌లో అది బ‌డ్జెట్ గా మారిపోయింది. ఏటా సెప్టెంబ‌ర్ లో బ‌డ్జెట్ ప్ర‌క‌ట‌న‌ను అన్ని మంత్రిత్వ శాఖ‌లు, విభాగాలు, స్వ‌తంత్ర సంస్థ‌ల‌కు పంపిస్తారు. న‌వంబ‌ర్ నెల‌లో వాణిజ్య మండ‌ళ్లు, రైతులు, ఉద్యోగ సంఘాల‌తో ఆర్థిక శాఖ అధికారులు చ‌ర్చిస్తారు. జ‌న‌వ‌రిలో వాణిజ్య మండ‌ళ్లు త‌దిత‌ర సంఘాల‌తో ఆర్థిక‌మంత్రి తుది స‌మావేశాలు నిర్వ‌హిస్తారు. ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తారు. అనంత‌రం బ‌డ్జెట్ తో సంబంధ‌మున్న ఆర్థిక శాఖ ఉన్న‌తాధికారులు, నిపుణులు, ముద్ర‌ణ‌కు సంబంధించిన సాంకేతిక నిపుణులు, స్టెనో గ్రాఫ‌ర్లు, జాతీయ స‌మాచార శాస్త్ర కేంద్రం అధికారుల‌ను ఢిల్లీలోని నార్త్ బ్లాక్…ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాల‌యంలోకి త‌ర‌లిస్తారు. ఇక వార‌క్క‌డే ఉండాలి. ఇత‌ర ప్ర‌పంచంతో సంబంధాలుండ‌వు. కుటుంబ స‌భ్యులు కూడా నేరుగా మాట్లాడే అవ‌కాశ‌ముండ‌దు. వారంతా బ‌య‌టి ప్ర‌పంచ‌లోకి వ‌చ్చేది బ‌డ్జెట్ ప్ర‌సంగం ప్రారంభ‌మ‌య్యాకే. అంత‌కుముందు నార్త్ బ్లాక్ లో హ‌ల్వా వేడుక నిర్వ‌హిస్తారు. ఆర్థిక మంత్రి హ‌ల్వాను సిబ్బందికి పంచిపెడ‌తారు.

ఆర్థిక‌మంత్రి ప్ర‌సంగాన్ని అత్యంత ర‌హస్యంగా ఉంచుతారు. బ‌డ్జెట్ ప్ర‌వేశపెట్ట‌డానికి రెండు రోజుల ముందు అర్ధరాత్రి స‌మ‌యంలో ముద్ర‌ణ‌కు ఇస్తారు. నార్త్ బ్లాక్ లోని దిగువ‌భాగంలో ఈ ముద్ర‌ణా కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. బడ్జెట్ ముద్ర‌ణ‌ను నిఘా సంస్థ‌ల అధికారుల బృందం నిశితంగా ప‌ర్య‌వేక్షిస్తుంది. బ‌డ్జెట్ ముద్ర‌ణ‌, రూప‌క‌ల్ప‌న‌కు సంబంధించిన కంప్యూట‌ర్లు, యంత్రాలకు ఇత‌ర స‌ర్వ‌ర్ల‌తో ఉన్న సంబంధాలు తెంచేస్తారు. సెల్ ఫోన్లు ప‌నిచేయ‌కుండా జామ‌ర్లు ఏర్పాటు చేస్తారు. బ‌డ్జెట్ స‌మర్ప‌ణ తేదీని ప్ర‌భుత్వం నిర్ణ‌యించి లోక్ స‌భ స్పీక‌ర్ కు ప్ర‌తిపాదిస్తుంది. అక్క‌డ ఆమోదం ల‌భించాక లోక్ స‌భ స‌చివాల‌యం రాష్ట్ర‌ప‌తి ఆమోదం కోరుతుంది. ఆర్థిక మంత్రి బ‌డ్జెట్ వివ‌రాల‌ను సంక్షిప్తంగా కేబినెట్ కు వివ‌రిస్తారు. ప్ర‌ధాని ఆమోదించాక, రాష్ట్ర‌ప‌తి ఆమోదానికి బ‌డ్జెట్ వివ‌రాలు అక్క‌డికి పంపుతారు. అనంత‌రం ఆర్థిక‌మంత్రి లోక్ స‌భ‌లో బ‌డ్జెట్ ను ప్ర‌వేశపెడ‌తారు. అనంత‌రం రాజ్య‌స‌భ‌లో స‌మ‌ర్పిస్తారు.

బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టాక ఆ రోజు స‌భ‌లో ఎలాంటి చ‌ర్చా జ‌ర‌గ‌దు. ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధికంగా ప‌దిసార్లు బ‌డ్జెట్ స‌మ‌ర్పించిన రికార్డు, దేశ నాలుగో ప్ర‌ధాని మొరార్జీ దేశాయ్ ది. రెండు సార్లు 1964, 1968ల్లో మొరార్జీ ఫిబ్ర‌వరి 29న త‌న పుట్టిన‌రోజునాడు స‌మ‌ర్పించారు. ఈ ప్ర‌త్యేకత మ‌రే ఆర్థిక‌మంత్రికీ లేదు. మొరార్జీ దేశాయ్ త‌ర్వాత ఎక్కువ బ‌డ్జెట్లు స‌మ‌ర్పించింది చిదంబ‌రం. ఆర్థిక‌మంత్రిగా ఆయ‌న ఎనిమిది బ‌డ్జెట్లు ప్ర‌వేశ‌పెట్టారు. త‌ర్వాత స్థానాల్లో ఏడు బ‌డ్జెట్లతో ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ, య‌శ్వంత్ సిన్హా, వైబీ చ‌వాన్, సీడీ దేశ్ ముఖ్ లు ఉన్నారు.

ప్ర‌స్తుత బడ్జెట్ ద్వారా అరుణ్ జైట్లీ ఐదు బ‌డ్జెట్లు స‌మ‌ర్పించిన మ‌న్మోహ‌న్ సింగ్, య‌శ్వంత్ సిన్హా స‌ర‌స‌న చేర‌నున్నారు. దేశానికి ఆర్థిక‌మంత్రులుగా ప‌నిచేసి త‌ర్వాత ప్ర‌ధాన‌మంత్రులైన‌వారు ఐదుగురు. ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, చ‌ర‌ణ్ సింగ్, వి.పి.సింగ్, మ‌న్మోహ‌న్ సింగ్. బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన ఏకైక మ‌హిళా ఆర్థిక‌మంత్రి ఇందిరాగాంధీ. ఆర్థిక మంత్రులుగా ప‌నిచేసి త‌ర్వాత కాలంలో ఆర్. వెంక‌ట్రామ‌న్, ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ రాష్ట్ర‌ప‌తుల‌య్యారు. 2000 సంవ‌త్స‌రం వ‌ర‌కు బడ్జెట్ ను సాయంత్రం 5గంట‌ల‌కు ప్ర‌వేశ‌పెట్టేవారు. 2001 నుంచి 11 గంట‌ల‌కు స‌మ‌యం మార్చారు. ప్ర‌పంచ దేశాల‌తో పోలిస్తే నిధుల ప‌రంగా బ‌డ్జెట్ విష‌యంలో భార‌త్ 13వ‌స్థానంలో ఉంది.