Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
క్రికెట్ అభిమానులు ఈ రోజును ఎప్పుడూ మర్చిపోలేరు. పదేళ్ల క్రితం 2007 సెప్టెంబరు 19న అంటే సరిగ్గా ఈ రోజే..భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో ఒకే ఓవర్లో 36 పరుగులు సాధించాడు. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒక్కో బంతిని సిక్సర్ గా మలిచాడు యువరాజ్. 19వ ఓవర్లో యువరాజ్ మైదానం నలుమూలలకు బంతిని తరలించాడు. స్డేడియంలోనూ, టీవీల్లో ప్రత్యక్షప్రసారంలోనూ మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు కాసేపు ఏం జరుగుతోందో అర్ధం కాలేదు. యువీ ఒక్కో బంతిని బౌండరీకి తరలిస్తోంటే ప్రేక్షకులంతా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూ ఆ రికార్డును తిలకించారు.
ఒకే ఒక్క ఓవర్లో 36 పరుగులు రావటాన్ని కాసేపటి దాకా ఎవరూ నమ్మలేకపోయారంటే అతిశయోక్తి కాదు. బౌలర్ బ్రాడ్ కయితే ముఖంలో నెత్తుటి చుక్క లేదు. యువరాజ్ కు అసలు బంతి ఏ దిశలో వెయ్యాలో అర్దంకాలేదు బ్రాడ్ కి. ఐసీసీ ప్రారంభించిన తొలి అంతర్జాతీయ టీ 20 సిరీస్ లోనే ఈ రికార్డు సాధించటం ద్వారా యువరాజ్ ట్వంటీ ట్వంటీల్లో ఉండే మజా ఏమిటో క్రికెట్ ప్రేక్షకులకు చూపించాడు. దక్షిణాఫ్రికాలో ఈ సిరీస్ జరిగింది. ఆరు బంతుల్లో 36 పరుగులు రాబట్టిన యువరాజ్ కేవలం 12 బంతుల్లో అర్ధసెంచరీ నమోదు చేశాడు. తర్వాతి రోజుల్లో టీ 20 మ్యాచ్ లు ఇంతగా సక్సెస్ కావడానికి యువరాజ్ సింగ్ చూసిన ఈ అసాధారణ ప్రతిభ దోహదపడిందనండంలో ఎలాంటి సందేహం లేదు. 2007లో మొదటి టీ 20 సిరీస్ జరిగితే…ఆ తర్వాత ఏడాదే పొట్టి క్రికెట్ లో మజాను గ్రహించిన బీసీసీఐ ఐపీఎల్ ప్రారంభించి ప్రపంచ క్రికెట్ గతిని మార్చివేసింది. అందుకే సెప్టెంబరు 19… 18 ఏళ్ల నుంచి క్రికెట్ కెరీర్ కొనసాగిస్తున్న యువరాజ్ సింగ్ కే కాదు…ట్వంటీ ట్వంటీ క్రికెట్ ను ప్రేమించే ప్రతి ఒక్కరికీ మరపురాని రోజే.