భారత మహిళల జట్టుకు చారిత్రక విజయం . 1977 నుంచి ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్న భారత్.. తొలిసారి ఆ జట్టును ఓడించింది. చివరిదైన నాలుగో రోజు, ఆదివారం ముగిసిన ఏకైక టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 2 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. స్మృతి మంధాన (38) రాణించింది. అంతకుముందు ఓవర్నట్ స్కోరు 233/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా.. భారత బౌలర్ల ధాటికి 28 పరుగులకే మిగతా అయిదు వికెట్లు కోల్పోయి, 261 పరుగులకే ఆలౌటైంది. ఇన్నింగ్స్‌లో స్నేహ్ రాణా నాలుగు వికెట్లు పడగొట్టగా.. రాజేశ్వరి గైక్వాడ్, హర్మన్‌ప్రీత్ కౌర్ చెరో రెండు వికెట్లు చేజిక్కించుకున్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 219 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 406 పరుగులు భారీ స్కోరు సాధించింది. స్నేహ్ రాణాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ నెలలోనే భారత మహిళల జట్టు ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. 1995 తర్వాత సొంతగడ్డపై ఓ ఏడాదిలో రెండు టెస్టులు ఆడడం భారత్‌కు ఇదే తొలిసారి. మహిళల క్రికెట్లో ఆసీస్‌తో ఇంతకుముందు పది టెస్టులు ఆడిన భారత్ ఒక్క సారి కూడా నెగ్గలేదు.