భారత జట్టును మరో వరల్డ్ కప్ ‘ఫైనల్’ వెక్కిరించింది. U19 ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడింది. 254 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన భారత్ 43.5 ఓవర్లలో కేవలం 174 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో U19 ప్రపంచ కప్ టోర్నీలో భారత జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఫలితంగా ఆస్ట్రేలియా…. 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ విజేతగా నిలిచింది.ఇటీవల వరల్డ్ కప్‌లో సీనియర్ జట్టులాగే టోర్నీలో మ్యాచ్‌లన్నీ గెలిచిన యంగ్ ఇండియా ఫైనల్లో బోల్తా పడింది. ఆస్ట్రేలియా 4వ U19 వరల్డ్ కప్ గెలిచింది.
బెనోని వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 254 రన్స్ ఛేదనలో భారత్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. మూడో ఓవర్లోనే ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (3) వికెట్ కోల్పోయిన భారత్ ను ముషీర్ ఖాన్ (22), ఆదర్శ్ సింగ్ (47) క్రీజ్ లో కుదురుకున్నట్టు కనిపించారు.. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 37 పరుగులు జోడించారు. ఈ మ్యాచ్‌లో భారత్ కు ఇదే హయ్యస్ట్ పార్ట్నర్షిప్. సెమీస్‌లో అద్భుత పోరాటంతో ఆకట్టుకున్న కెప్టెన్ ఉదయ్ సహరన్ (8), సచిన్ దాస్ (9)లు ఫైనల్లో దారుణంగా విఫలమయ్యారు. ప్రియాన్షు మోలియా (9), వికెట్ కీపర్ అవినాశ్ రావు డకౌట్ అయ్యాడు.
122 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన భారత్ ఈ మాత్రం రన్స్ చేయగలిగిందంటే దానికి కారణం స్పిన్ బౌలర్ మురుగన్ అభిషేక్ పోరాటమే. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. 46 బంతుల్లో 42 రన్స్ చేసి ఇండియా తక్కువ స్కోరుకు ఆలౌట్ కాకుండా కంగారుల విజయాంతరాన్ని తగ్గించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మహిల్ బీర్డ్‌మన్, మాక్‌మిలన్‌లు తలా మూడు వికెట్లు పడగొట్టారు.