దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఘోర పరాభవాన్ని ఖాతాలో వేసుకున్న టీమ్ఇండియా రెండో మ్యాచ్ కోసం పేస్ బౌలింగ్‌ను బలంగా మార్చుకునే ప్రయత్నాల్లో పడింది. ఈ క్రమంలోనే అవేశ్ ఖాన్‌ను టెస్టు జట్టులోకి తీసుకుంది. గాయంతో ముందే సిరీస్‌కు దూరమైన షమి స్థానాన్ని అవేశ్‌తో భర్తీ చేసినట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. ‘‘జనవరి 3న కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో ఆరంభమయ్యే రెండో టెస్టు కోసం షమి స్థానంలో అవేశ్ ఖాన్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది’’ అని బీసీసీఐ వెల్లడించింది. 27 ఏళ్ల అవేశ్ ఇప్పటివరకూ 39 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 154 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా- ఎ జట్టుతో డ్రాగా ముగిసిన నాలుగు రోజుల మ్యాచ్‌లో భారత్-ఎ తరపున అతను తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఇన్నింగ్స్, 32 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో శార్దూల్, ప్రసిద్ధ్ పూర్తిగా తేలిపోయారు. ఈ నేపథ్యంలోనే అవేశ్ జట్టులోకి వచ్చాడు.