సఫారీల గడ్డపై 2018లో తొలి వన్డే సిరీస్ను కైవసం చేసుకున్న భారత్.. ఐదేళ్ల తర్వాత మరో సిరీస్ను దక్కించుకుంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా పార్ల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ ప్రదర్శన చేసి 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజు శాంసన్ (108) తొలిసారి వన్డేల్లో శతకం బాదాడు. తిలక్ వర్మ (52 ) కూడా వన్డేల్లో మొదటి అర్ధ శతకం సాధించాడు. 297 పరుగుల లక్ష్య ఛేదనలో ఆతిథ్య జట్టు 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. రెండో వన్డేలో సెంచరీ బాదిన టోనీ డి జోర్జి (81) ఈ మ్యాచ్లోనూ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ (4/30) చెలరేగాడు. అవేశ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్కు ఒక్కో వికెట్ దక్కింది.
లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు రిజా హెండ్రిక్స్ (19), టోనీ డి జోర్జి శుభారంభం అందించారు. నిలకడగా ఆడుతున్న హెండ్రిక్స్ ను అర్ష్దీప్ పెవిలియన్కు పంపడంతో 59 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన వాండర్ డసెన్ (2)ని అక్షర్ పటేల్ క్లీన్బౌల్డ్ చేశాడు. మరోవైపు, జోర్జి నిలకడగా బౌండరీలు బాదుతూ 54 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మార్క్రమ్ (36) క్రీజులో నిలదొక్కుకోవడంతో సౌతాఫ్రికా 25 ఓవర్లకు 135/2 స్కోరుతో మెరుగైన స్థితిలోనే నిలిచింది. కానీ, వాషింగ్టన్ సుందర్ వేసిన తర్వాతి ఓవర్ నుంచి సఫారీలు వరుసగా వికెట్లు కోల్పోయారు. మార్క్రమ్ని సుందర్ వెనక్కి పంపగా.. కొద్దిసేపటికే జోర్జిని అర్ష్దీప్ వికెట్ల ముందు దొరకబుచ్చు కున్నాడు. అవేశ్ ఖాన్ బౌలింగ్లో క్లాసెన్ (21) ఔటయ్యాడు. సాయి సుదర్శన్ మిడాఫ్లో మంచి డైవ్ చేసి క్యాచ్ అందుకోవడంతో క్లాసెన్ వెనుదిరిగాడు. వియాన్ ముల్డర్ (1)ని వాషింగ్టన్ సుందర్ బుట్టలో వేసుకున్నాడు. డేంజరస్ డేవిడ్ మిల్లర్ (10).. ముకేశ్ కుమార్ బౌలింగ్లో వికెట్ కీపర్ రాహుల్కు క్యాచ్ ఇచ్చాడు. కేశవ్ మహరాజ్ (14), విలియమ్స్ (2)లను అర్ష్దీప్ వరుస ఓవర్లలో పెవిలియన్కు పంపాడు. బ్యురాన్ హెండ్రిక్స్ (18).. అవేశ్ ఖాన్ బౌలింగ్లో శాంసన్కు చిక్కడంతో సఫారీల కథ సమాప్తమైంది.