అప్గానిస్తాన్ తో మూడో టీ 20లో భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పూర్తిగా నిరాశ పరిచాడు. తాను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్ కే ఔట్ అయ్యాడు. టీ 20 ప్రపంచ కప్ 2024కు ముందు టీమిండియా చివరిసారిగా ఆడుతున్న ఈ సిరీస్ తోనే కోహ్లీ అంతర్జాతీయ టీ20లో పునరాగమనం చేశాడు. వ్యక్తిగత కారణాలతో తొలి మ్యాచ్ కి దూరమైన ఈ రన్ మెషీన్.. ఇండోర్ లో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. మొత్తానికి 16 బంతుల్లో 29 పరుగులతో రాణించాడు. అయితే బెంగళూరులో జరుగుతున్న మూడో టీ20లో మాత్రం విఫలం అయ్యాడు.
ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) స్థానంలో క్రీజులోకి వచ్చాడు కోహ్లీ.. గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు. అప్గాన్ పేసర్ ఫరీద్ అహ్మద్ బౌలింగ్ లో టిమిండియా ఇన్నింగ్స్ మూడో ఓవర్ నాలుగో బంతికి.. పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు కోహ్లీ. మిడాప్ లో ఫీల్డింగ్ చేస్తున్న ఇబ్రహీం జద్రాన్ కి క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. దీంతో అంతర్జాతీయ టీ 20 కెరీర్ లో తొలిసారి గోల్డెన్ డకౌట్ నమోదు చేశాడు కోహ్లీ. ఐపీఎల్ లో తన సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఈ చెత్త రికార్డు నమోదు చేయడం గమనార్హం.