ఇంతింతై అన్నట్లు ఎదుగుతున్న ఐపీఎల్ మరో ఘనత సొంతం చేసుకుంది. 10 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువను దాటి డెకాకార్న్ హోదాను దక్కించుకుంది. ప్రస్తుతం ఐపీఎల్ బ్రాండ్ విలువ 10.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ.83,353 కోట్లు)గా ఉంది. 2022 (8.4 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే ఆ విలువ 28 శాతం పెరిగింది. ఇక ఐపీఎల్ ఆరంభమైన 2008తో పోలిస్తే ఏకంగా 433 శాతం వృద్ధి ఉంది. బ్రాండ్ విలువను లెక్కగట్టే సంస్థ బ్రాండ్ ఫినాన్స్రివీల్స్ ఈ నివేదికను వెల్లడించింది. మీడియా హక్కుల కింద 6.2 బిలియన్ డాలర్లు (రూ.48,390 కోట్లు) రావడం, రెండు ఫ్రాంఛైజీలు కొత్తగా చేరడం, కొవిడ్ తర్వాత స్టేడియాలు పూర్తిగా నిండటం తదితర కారణాలతో బ్రాండ్ విలువ పెరిగిందని నివేదిక పేర్కొంది. ఇక ఫ్రాంఛైజీల విషయానికి వస్తే ముంబయి ఇండియన్స్ 87 మిలియన్ డాలర్లు (సుమారు రూ.725 కోట్లు), చెన్నై సూపర్ కింగ్స్ 81 మిలియన్ డాలర్లు (రూ.675 కోట్లు), కోల్కతా నైట్రైడర్స్ 78.6 మిలియన్ డాలర్లు (రూ.655 కోట్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 69.8 మిలియన్ డాలర్లు (రూ.581 కోట్లు) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.