ఆరంభం పేలవం.. ముగింపు అద్భుతం.. ఇదీ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలిరోజు భారత్ ఆటతీరు. 33/3 స్కోరుతో కష్టాల్లో పడిన భారత్ ను సెంచరీలతో కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా కాపాడారు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ తన అరంగేట్ర టెస్టును ‘వన్డే’లా మార్చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ మొదటిరోజు ఆట ముగిసింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలిరోజు ఆట ముగిసేసరికి 86 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (131), రవీంద్ర జడేజా (110*) సెంచరీలు సాధించి నాలుగో వికెట్‌కు 204 పరుగులు జోడించారు. దేశవాళీ క్రికెట్లో అదరగొట్టి జాతీయ జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ (62) చెలరేగిపోయాడు. ఐదో బంతికి పరుగుల ఖాతా తెరిచిన సర్ఫరాజ్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. వన్డే తరహాలో పరుగులు రాబట్టాడు. జడేజాతో కలిసి ఐదో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. అయితే, జడ్డూతో సమన్వయలోపం వల్ల రనౌట్‌గా సర్ఫరాజ్ పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో డగౌట్‌లోని రోహిత్ తీవ్ర అసహనంతో తన క్యాప్‌ను విసిరి కొట్టిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.