ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న డీప్‌ఫేక్ బారిన పడుతున్న వారిలో ముఖ్యంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీస్ కత్రినా కైఫ్, సన్నీ లియోనీ, రష్మిక మందన్న దీనిబారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ చేరారు. తాజాగా ఆయన కూడా డీప్‌ఫేక్ వీడియో బారిన పడ్డారు. ఓ గేమింగ్ యాప్‌నకు సచిన్ ప్రచారం చేస్తున్నట్లు ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఇది కాస్త సచిన్ దృష్టికి రావడంతా దానిపై స్పందించారు. ఆ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేసిన మాస్టర్ బ్లాస్టర్ ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటూ అసలు విషయం చెప్పారు. వీడియోను రూపొందించిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో ఫేక్ అని టెక్నాలజీని ఇలా విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తోందని వాపోయారు. ఇలాంటి వీడియోలు, ప్రకటనలు ఎక్కడ కనిపించినా వెంటనే సంబంధిత అధికారులకు రిపోర్ట్ చేయాలని సూచించారు. నకిలీ సమాచారం, డీప్‌ఫేక్ వీడియోల వ్యాప్తిని అరికట్టేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు.