పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మరోసారి పెళ్లి పీటలెక్కాడు. పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను శనివారం (జనవరి 20వ తేదీ) షోయబ్ మూడో వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని నూతన జంట సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే 2010 ఏప్రిల్‌లో భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జాను షోయబ్ పెళ్లిచేసుకున్నాడు. గత కొంతకాలంగా షోయబ్, సానియా విడిపోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో షోయల్ తన పెళ్లి వార్తను చెప్పడంతో వీరి విడాకులు కన్ఫామ్ అని అర్థమైపోయింది.
ఈ నేపథ్యంలో సానియా మీర్జా టీమ్ అండ్ కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. “సానియా తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ గోప్యంగానే ఉంచింది. షోయబ్, సానియా గత కొన్ని నెలల క్రితం విడిపోయారు. ఇప్పుడు వారు వారి జీవితాల్లో విడివిడిగా ముందుకెళ్తున్నారు. తన లైఫ్‌లో కొత్త చాప్టర్ స్టార్ట్ చేసిన షోయబ్‌కు సానియా గుడ్ లక్ చెప్పింది. తన జీవితంలో ఇది చాలా సున్నితమైన సమయం. దయచేసి అందరూ తనకు సహకరించాలి. తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించొద్దని మేం కోరుకుంటున్నాం. ఈ క్లిష్ట సమయంలో మాకు మీరు తోడుగా నిలుస్తారని ఆశిస్తున్నాం” అంటూ మీర్జా ఫ్యామిలీ, టీమ్ సానియా సంయుక్త ప్రకటన విడుదల చేసింది.