శ్రీ చైతన్య విద్యాసంస్థలు నిబంధనలను పట్టించుకోకుండా టాలెంట్ టెస్టులను నిర్వహించడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. జిల్లాలో ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాఠశాలలకు నోటీసులు జారీ చేసి, నిర్వాహకుల నుంచి వచ్చిన వివరణ అనంతరం క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేశారు. దసరా సెలవుల్లో ఎటువంటి తరగతులు నిర్వహించకూడదని డీఈఓ ఎంవీ రాజ్యలక్ష్మి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేక తరగతుల పేరుతో పదో తరగతి విద్యార్థులను సైతం పాఠశాలలకు పిలిపించివద్దని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల విద్యా శాఖ క్యాలెండర్‌కు అనుగుణంగా దసరా సెలవులు ముగిసేంత వరకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రత్యేక తరగతులు వద్దని ఆదేశాలు ఇచ్చారు. కానీ శ్రీ చైతన్య విద్యా సంస్థల నిర్వాహకులు దీనిని పెడచెవిన పెట్టారు. డీఈఓ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ఆదివారం టాలెంట్ టెస్టులను నిర్వహించారు. నందిగామ, మైలవరం, విజయవాడలోని మొగల్రాజపురం వంటి చోట్ల అప్పటికప్పుడు విద్యా శాఖాధికారులు వెళ్లి టాలెంట్ టెస్టులను అడ్డుకొని విద్యార్థులను ఇళ్లకు పంపించారు.