నారాయణ నడిగడ్డపై చైతన్య శపధం…

Sri Chaitanya MD Sushma About Management Kidnaps Student Controversy in nellore

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నీ సొంత జిల్లాకే వచ్చాము, మా మనుషుల్ని విడిపించుకునే వెళతాం… ఇదేదో ఫ్యాక్షన్ సినిమాలో డైలాగ్ కాదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం దేశమంతటా కార్పొరేట్ విద్యావ్యవస్థని తమ కనుసన్నల్లో నడిపిస్తున్న చైతన్య విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన నారాయణ సొంత గడ్డ నెల్లూరు లో చేసిన శపధం ఇది. ఇది ప్రస్తుతం నారాయణ, చైతన్య మధ్య ఉద్రిక్త పరిస్థితికి నిదర్శనం.

బాగా చదివే విద్యార్ధులకి డబ్బులిచ్చి ఆ పేరుని కార్పొరేట్ విద్యాసంస్థలు తమ బ్రాండ్ కోసం వాడుకోవడం కొత్త విషయం ఏమీ కాదు. విద్యా రంగంలో కొద్దిపాటి దృష్టి పెట్టిన వాళ్ళు అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. కాకపోతే నారాయణ, చైతన్య కొట్టుకుని ఇప్పుడు రచ్చకెక్కాయి. నారాయణ విద్యార్థుల్ని చైతన్య కిడ్నాప్ చేసిందన్నది ఇప్పుడొచ్చిన ప్రధాన ఆరోపణ. ఆ విద్యార్థుల్లో ఒకరి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చైతన్య స్టాఫ్ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ విద్యార్థుల్ని వదిలిపెడితే ఆ సిబ్బందిని కేసు నుంచి బయటపడేస్తామని నారాయణ వాదిస్తోంది. అయితే ఆ విద్యార్థుల్ని వారి తల్లిదండ్రులే ఇష్టపూర్వకంగా చేర్చారని, ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు తమ దగ్గర ఉన్నట్టు చైతన్య అంటోంది. పైగా విద్యార్థుల్ని ఇలా తెచ్చుకోవడంలో నారాయణ ఆరితేరిందని కూడా చైతన్య ఆరోపిస్తోంది. అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని ఎన్నో అక్రమాలు, మోసాలకు పాల్పడ్డారని చైతన్య డైరెక్టర్ సుష్మ నేరుగా మంత్రి నారాయణని టార్గెట్ చేశారు. పైగా నీ జిల్లాకి వచ్చా , మా సిబ్బందిని విడిపించుకు వెళతాం అని ఆమె చేసిన హెచ్చరిక ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది.

నారాయణ కూడా చైతన్య కూడా ఎన్నో తప్పులు చేసినట్టు ఆరోపించింది. అయితే చైతన్య డైరెక్టర్ చేసిన శపధం చూస్తే ఇదేదో చిన్న విషయం అనిపించడం లేదు. రాజకీయాల్లో నారాయణ ప్రాభవాన్ని అడ్డుకోడానికి చైతన్యకి కొందరు నాయకులు వత్తాసు పలుకుతున్నట్టు తెలుస్తోంది. ఓ మంత్రి కూడా ఈ వ్యవహారంలో చైతన్యకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారంట. ఈ గొడవ మున్ముందు ఎక్కడికి వెళుతుందో చూడాలి.