శ్రీలంక హెడ్ కోచ్ బాధ్యతల నుంచి మిక్కీ ఆర్థర్ తప్పకున్న తర్వాత ఆ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు జరగనున్నాయి. ఆ జట్టు మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనేని కన్సల్టెంట్ కోచ్‌లో ఒకరిగా నియమించేందుకు శ్రీలంక క్రికెట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మరో వైపు కన్సల్టెంట్ కోచ్‌లుగా ఆ జట్టు సీనియర్ ఆటగాళ్లు రంగనా హెరాత్, నువాన్ కులశేఖర, లసిత్ మలింగలను కూడా నియమించేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డ్ చర్చలు జరుపుతుంది. శ్రీలంక జాతీయ జట్టు, శ్రీలంక ‘ఎ’ జట్టు, అండర్-19 జట్టును కూడా జయవర్ధనే పర్యవేక్షిస్తారని సమాచారం. మహేల జయవర్ధనే జట్టులోకి రావడానికి అంగీకరిస్తే మేము చాలా సంతోషిస్తాం అని శ్రీలంక క్రికెట్ అధికారి ఒకరు తెలిపారు.
“మహేలా జయవర్ధనే జట్టులోకి రావడానికి అంగీకరిస్తే మేము సంతోషిస్తాము. అతడు టీ20 ప్రపంచకప్ సమయంలో యూఏఈలో జట్టుతో ఉన్నప్పుడు జట్టులో వత్యాసం మాకు సృష్టంగా కనిపించింది. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది నుంచి మాకు లభించిన ఫీడ్‌బ్యాక్ అద్భుతంగా ఉంది” అని శ్రీలంక క్రికెట్ అధికారి పేర్కొన్నారు. కాగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు, ది హండ్రెడ్ లీగ్‌లో సదరన్ బ్రేవ్ జట్టుకు హెడ్ కోచ్‌గా జయవర్ధనేబాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.