కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి న్యాయ‌పోరాటం

Sri Reddy wants to Legal battle on Casting Couch

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కాస్టింగ్ కౌచ్ పై పోరాటం మొద‌లుపెట్టి… కొన్నిరోజుల నుంచి కాస్త సైలెంట్ గా ఉంటున్న శ్రీరెడ్డి మ‌ళ్లీ మీడియా ముందుకొచ్చింది. తాను న్యాయ‌పోరాటానికి దిగ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. హైద‌రాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్ల‌బ్ లో ఏర్పాటుచేసిన మీడియా స‌మావేశంలో త‌న త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌ను వివ‌రించింది. తెలంగాణ ఉద్య‌మం కంటే ఎక్కువ స్థాయిలో త‌న పోరాటం ఉంటుంద‌ని శ్రీరెడ్డి తెలిపింది. డ‌బ్బులు తీసుకున్న‌ట్టు త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, ఇవ్వ‌డానికి కొంద‌రు పెద్ద‌లు ప్ర‌య‌త్నించిన మాట వాస్త‌వ‌మేన‌ని, తాను తిర‌స్కరించాన‌ని చెప్పుకొచ్చింది. తాను ఏమీ ఆశించి ఉద్య‌మం చేయ‌డం లేదని, మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాడాల‌న్న‌దే త‌న ఆశ‌య‌మ‌ని తెలిపింది.

ఇటీవ‌ల మీడియా ముందుకొచ్చిన పెద్ద‌లు హుందాగా మాట్లాడ‌కుండా… బెదిరింపు ధోర‌ణిలో మాట్లాడార‌ని, అలాంటి బెదిరింపులకు తాను భ‌య‌ప‌డ‌న‌ని శ్రీరెడ్డి స్ప‌ష్టంచేసింది. సినీ ప‌రిశ్ర‌మ‌ను నాలుగు కుటుంబాలే ఏలుతున్నాయ‌ని, కాష్ క‌మిటీలోనూ మ‌ళ్లీ ఆ నాలుగు కుటుంబాల‌కు చెందిన‌వారినే ఎలా వేస్తార‌ని ప్ర‌శ్నించింది. వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రించిన వారు ఎంతటివారైనా వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తేలేద‌ని తేల్చిచెప్పింది. యూట్యూబ్ లో ఉన్న త‌న వీడియోల‌పై త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌తి ఒక్క‌రిపై న్యాయ‌పోరాటం చేస్తాన‌ని, మ‌హిళ‌ల్లో తెగింపు వ‌స్తే ఏ విధంగా స్పందిస్తారో… త‌న పోరాటం తెలియ‌జేస్తుంద‌ని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. గోపాల‌కృష్ణ క‌ళానిధి, ర‌చ‌నారెడ్డితో పాటు మ‌రో ఇద్ద‌రు న్యాయ‌వాదులు త‌న త‌ర‌పున న్యాయ‌పోరాటం చేస్తార‌ని ఆమె తెలిపింది. కాస్టింగ్ కౌచ్ పై త్వ‌ర‌లో సుప్రీంకోర్టులో ప్ర‌జాహిత వ్యాజ్యం దాఖ‌లు చేస్తామ‌ని, అన్ని రాష్ట్రాల డీజీపీలు, హోంశాఖ‌, కేంద్ర ప్ర‌భుత్వాన్ని పార్టీలుగా చేరుస్తామ‌ని శ్రీరెడ్డి న్యాయ‌వాది గోపాల‌కృష్ణ తెలిపారు.