శ్రీదేవి గురించి, ఆమె ఫ్యామిలీ గురించి మీకు తెలియని నిజాలు

Sridevi Family Background details

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్ నూ ఏలిన శ్రీదేవి స్వ‌స్థ‌లం ఏమిటి? ఆమె మాతృభాష ఏది? ఆమె తెలుగ‌మ్మాయా…? త‌మిళ‌మ్మాయా… ఆమె త‌ల్లిదండ్రులెవ‌రు? వ‌ంటి విష‌యాల‌పై చిత్ర‌సీమ‌లో అనేక‌ర‌కాల వార్త‌లున్నాయి. కొంద‌రు ఆమె త‌మిళ‌మ్మాయంటే… మ‌రికొంద‌రు కాదు తెలుగ‌మ్మాయే అని వాదిస్తుంటారు. ద‌క్షిణాది నుంచి ఉత్త‌రాదికి వెళ్లి ఆమె అక్కడే స్థిర‌ప‌డ‌డంతో తెలుగు, త‌మిళంతో సంబంధం లేకుండా… దక్షిణాది నుంచి వ‌చ్చిన అమ్మాయిగా బాలీవుడ్ లో అంద‌రూ చెప్పుకుంటారు. ఇప్పుడామె మ‌ర‌ణంతో శ్రీదేవి మాతృభాష‌, స్వ‌స్థ‌లం, త‌ల్లిదండ్రులు వంటి విష‌యాలు మ‌ళ్లీ చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

శ్రీదేవి 1963 ఆగ‌స్టు 13న త‌మిళ‌నాడులోని శివ‌కాశిలో జ‌న్మించారు. త‌మిళ‌నాడులో ఉన్న‌ప్ప‌టికీ శ్రీదేవి త‌ల్లిదండ్రులిద్ద‌రూ తెలుగు కుటుంబాల‌కు చెందిన వారే. శ్రీదేవి త‌ల్లి రాజేశ్వ‌రి తిరుప‌తిలోనే పుట్టిపెరిగారు. తండ్రి అయ్య‌ప్ప‌న్ రెడ్డిది శివ‌కాశిలో స్థిర‌ప‌డ్డ తెలుగు కుటుంబం. శ్రీదేవి కుటుంబం మూలాల్లోకి వెళ్తే… ఆమె తాత క‌టారి వెంక‌టస్వామిరెడ్డిది తిరుప‌తి. ఆయ‌న తిరుప‌తి, గ్యార‌పల్లి, జ‌మ్మ‌ల‌మడుగు మ‌ధ్య బ‌స్సులు న‌డిపేవారు. ఈ క్ర‌మంలో జ‌మ్మ‌ల‌మ‌డుగులో న‌ర్సుగా ప‌నిచేస్తున్న బ‌లిజ‌వ‌ర్గానికి చెందిన వెంక‌ట‌రత్న‌మ్మ‌ను ప్రేమించి కులాంత‌ర వివాహంచేసుకున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న తిరుప‌తిలోని రుయా ఆస్ప‌త్రిలో ఉద్యోగంలో చేరారు. వెంక‌ట‌స్వామి దంప‌తుల‌కు ఆరుగురు పిల్ల‌లు. పెద్ద కుమారుడు బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, ఆ త‌రువాత శ్రీదేవి త‌ల్లి రాజేశ్వ‌ర‌మ్మ‌, చిన్నాన్న సుబ్బ‌రామ‌య్య‌, పిన్నిలు అన‌సూయ‌మ్మ‌, అమృత‌మ్మ‌, శాంత‌మ్మ‌లు. వారంతా తిరుప‌తిలోని 93-టీకె వీధిలో ఉండేవారు. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యానికి చెన్నైలో ఉద్యోగం రావ‌డంతో ఆయ‌న త‌న‌తో పాటు త‌మ్ముడు, చెల్లెల్లంద‌రినీ చెన్నై తీసుకెళ్లారు.

అక్క‌డ శ్రీదేవి త‌ల్లి మిన‌హా మిగిలిన వారంతా ఉద్యోగాల్లో స్థిర‌ప‌డ్డారు. ఆమె మాత్రం న‌టిగా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తూ రంగారావు అనే చిన్న‌స్థాయి న‌టుడిని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వారికి సూర్య‌క‌ళ అనే కుమార్తె పుట్టింది. అనంత‌రం రంగారావు క‌నిపించ‌కుండా పోయారు. దీంతో రాజేశ్వ‌రి ఒంటరివార‌య్యారు. కొన్నాళ్లు ఒంట‌రిజీవితం గ‌డిపిన రాజేశ్వ‌రి త‌ర్వాత శివ‌కాశిలో న్యాయ‌వాదిగా పనిచేస్తున్న అయ్య‌ప్ప‌న్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. అయ్య‌ప్ప‌న్ రెడ్డికి అప్ప‌టికే వివాహ‌మై ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయ్య‌ప్ప‌న్ తో పెళ్లి త‌ర్వాత రాజేశ్వ‌రి త‌న కుమార్తె సూర్య‌క‌ళ‌ను త‌న త‌ల్లిదండ్రుల వ‌ద్ద ఉంచారు. సూర్య‌క‌ళ అక్క‌డే పెరిగి పెద్ద‌ద‌యింది. రాజేశ్వ‌రి, అయ్య‌ప్ప‌న్ దంప‌తుల‌కు శ్రీదేవి, శ్రీల‌త పుట్టారు. ఇదీ… శ్రీదేవి పుట్టుపూర్వోత్త‌రాల క‌థ‌. తాను న‌టి కావాల‌ని క‌ల‌లు క‌న్న రాజేశ్వ‌రి… కూతురు శ్రీదేవి ద్వారా ఆ క‌ల‌లు నెర‌వేర్చుకున్నారు. శ్రీదేవి అక్క సూర్య‌క‌ళ‌కు కుటుంబంలోని బంధువుతో వివాహం జ‌రిగింది. హీరోయిన్ మ‌హేశ్వ‌రి సూర్య‌క‌ళ కూతురే. శ్రీదేవి చెల్లెలు శ్రీల‌త మ‌ధురై కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ్ ను వివాహం చేసుకున్నారు.