గత కొద్దిరోజులుగా ప్రేమికల ప్రేమ కధలు విషాదంతో ముగుస్తున్నాయి. మొన్న ప్రణయ్, నిన్న మాధవి నేడు శ్రీకాంత్. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను తననుంచి దూరం చేశారన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్లోని పాతబస్తీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంతోష్ నగర్ పీఎస్ పరిధిలోని రక్షపురంకు చెందిన చిట్టిపాక శ్రీకాంత్ అనే యువకుడు నాలుగు సంవత్సరాల క్రితం ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో పోలీస్ శాఖలో పనిచేస్తున్న అమ్మాయి తండ్రి షణ్ముగచారి ఆమెను ఇటీవల బలవంతంగా ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం సదరు యువతిని బెదిరించి శ్రీకాంత్ కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టించాడు. దీనికి తోడు ఏడు నెలల గర్భవతైన శ్రీహర్షకు ఆమె తండ్రి అబార్షన్ చేయించినట్లు తేలింది. బలవంతంగా భార్యను తీసుకెళ్లిపోవటంతో మనస్తాపానికి గురయ్యాడు. భార్య శ్రీహర్షకు బలవంతంగా అబార్షన్ చేయించడం, తన కుటుంబ సభ్యులపై శ్రీహర్ష తండ్రి షణ్ముగచారి అక్రమ కేసులు పెట్టడంతో మనస్తాపానికి లోనైన శ్రీకాంత్ నిన్న రాత్రి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ నేపథ్యంలో 90 శాతం గాయాలు అయిన శ్రీకాంత్ ఈ రోజు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. తాను చనిపోయే ముందు తన చావుకు శ్రీహర్ష కుటుంబ సభ్యులే కారణమని శ్రీకాంత్ సెల్ఫీ వీడియోలో తెలిపాడు. అతని కుటుంబ సభ్యు;ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.