శ్రీలంక సీనియర్ ఆటగాడు, వికెట్ కీపర్ ఉపుల్ తరంగ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. తన 16 ఏళ్ల కెరీర్ నేటితో ముగిసిందంటూ ట్విటర్ ద్వారా ప్రకటించాడు.2005లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన తరంగ 235 వన్డేల్లో 6951 పరుగులు, 31 టెస్టుల్లో 1754 పరుగులు, 26 టీ20ల్లో 407 పరుగులు చేశాడు. వన్డేల్లో 15 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు చేసిన తరంగ.. టెస్టుల్లో 3 సెంచరీలు, 8 అర్థ శతకాలు బాదాడు.
2007,2011 ప్రపంచకప్‌లలో తరంగ శ్రీలంక జట్టు సభ్యుడిగా ఉన్నాడు.2006లో ఇంగ్లండ్ టూర్‌లో వన్డే సిరీస్‌ను 5-0 తేడాతో వైట్‌వాష్ చేయడం వెనుక తరంగ కీలకపాత్ర పోషించాడు. ఆ సిరీస్‌లో సనత్ జయసూర్యతో కలిసి తరంగ వన్డే ఓపెనింగ్ రికార్డు భాగస్వామ్యం సాధించడంతో పాటు 102 బంతుల్లో 109 పరుగులు చేసి వెలుగులోకి వచ్చాడు. 2019లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా లంక తరపున తరంగ తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు.
ఈ సందర్భంగా తరంగ ట్విటర్ ద్వారా తన భావోద్వేగాన్ని పంచుకున్నాడు. ‘ ఈరోజుతో అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలకాలనుకుంటున్నా. కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. 16 ఏళ్ల పాటు లంక్ క్రికెట్‌కు సేవలందించడం గొప్ప అనుభూతి. ఈ 16 ఏళ్లలో జట్టుతో ఎన్నో జ్ఞాపకాలతో పాటు మంచి స్నేహితులు ఎందరో దొరికారు.
విఫలమైన ప్రతీసారి నాపై ఉన్న నమ్మకంతో అవకాశాలు ఇచ్చిన లంక్ క్రికెట్ బోర్డుకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇన్నేళ్ల పాటు నాకు మద్దతునిచ్చిన అభిమానులకు.. కష్టకాలంలో నాకు తోడుగా ఉన్న కుటుంబసభ్యులకు ఎంతో రుణపడి ఉన్నా.మీరిచ్చిన ఆశీర్వాదంతోనే ఇంతకాలం క్రికెట్‌ను ఆడగలిగా.. థ్యాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్’ అంటూ ఉద్వేగంతో తెలిపాడు.