నటీనటులు: నితిన్,రాశీ ఖన్నా,నందితా శ్వేత,రాజేంద్ర ప్రసాద్,ప్రకాశ్‌రాజ్,జయసుధ,అన్నపూర్ణ,సితార
దర్శకత్వం: సతీష్ వేగేశ్న
సంగీతం: మిక్కి జె.మేయర్
నిర్మాత: దిల్ రాజు
ఆగష్టు 9 అంటే దిల్ రాజు కి ఎంతో గురి. ఒకప్పుడు ఆయన బ్యానర్ విలువ పెంచిన బొమ్మరిల్లు అదే రోజు విడుదల అయ్యి ఘన విజయం సాధించింది. అదే స్థాయి సినిమా అని “శ్రీనివాస కళ్యాణం “ మీద ఆయన నమ్మకం పెట్టుకున్నారు. అదే రోజు రిలీజ్ పెట్టుకున్నారు. విడుదలకి ముందే డిస్ట్రిబ్యూటర్స్ కి కూడా పూర్తి సినిమా చూపించారు. ఓ నిర్మాతకి ఈ రోజుల్లో ఓ సినిమా మీద ఇంత నమ్మకం ఉండడం చిన్న విషయం కాదు. దిల్ రాజు అంతగా నమ్మింది ఇంతక ముందు శతమానంభవతి వంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు సతీష్ వేగేశ్న కథని. వైవాహిక బంధం విలువ గురించి ఈ తరానికి చెప్పాలన్న తపన కూడా ఆ నమ్మకానికి తోడైంది. ఆ ఇద్దరి మీద నమ్మకంతో హీరో నితిన్ పెట్టిన విశ్వాసమే శ్రీనివాస కళ్యాణం గా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ…
ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన శ్రీనివాసరాజు ( నితిన్ ) కి పెళ్లి ఓ పండగ అని నాన్నమ్మ చెప్పిన మాటలు గుండెల్లో నాటుకుపోతాయి. అత్త పెళ్ళిలో చిన్నప్పటి మంత్రాలు ఆలా గుర్తుండిపోతాయి. ఉద్యోగం కోసం ఇంటికి దూరంగా ఉన్నప్పటికీ నిత్యం ఇంట్లో వాళ్ళతో టచ్ లో వుండే శ్రీనివాసరాజు అంటే అతని మరదలికి ఇష్టం ఏర్పడుతుంది. అయితే శ్రీనివాస్ తో ఓ శ్రీమంతుడి కుమార్తె శ్రీదేవి ప్రేమలో పడుతుంది. ఆ ప్రేమని శ్రీను కూడా ఒప్పుకుంటాడు. కానీ అంతకుముందు మధ్యతరగతి జీవితం గడిపిన శ్రీదేవి శ్రీను ప్రేమ కి ఓకే చెప్పాక తన కుటుంబ నేపధ్యం చెబుతుంది. ఆమె ఆర్కే గ్రూప్ అఫ్ కంపెనీస్ యజమాని రెండో కుమార్తె. ఆ ఆర్కే దృష్టిలో పెళ్లి అంటే ఓ ఈవెంట్ మాత్రమే. అలాంటి ఆర్కే కూతురు ప్రేమని తేలిగ్గానే ఒప్పుకున్నప్పటికీ రహస్యంగా శ్రీనివాస్ తో ఓ మెలిక పెడతాడు. ఆ మెలిక ఏమిటి దాన్ని శ్రీనివాస్ ఎలా అధిగమించాడు ? ఈ క్రమంలో పెళ్లి గొప్పదనం ఏమిటి అన్నదే మిగిలిన కథ.
విశ్లేషణ …
” కాలంతో పాటు మనుషులు మారొచ్చు కానీ బంధాలు, అనుబంధాలు , సంప్రదాయాలు నిలుపుకోవాలి . ఇక కొత్త తరానికి , జీవితానికి అతి ముఖ్యమైన పెళ్లి కి ఇంకా ఎక్కువ విలువ ఇవ్వాలి “… ఈ పాయింట్ చుట్టూ దర్శకుడు సతీష్ వేగేశ్న కథ అల్లుకున్నాడు. ఇదే విషయం ప్రముఖంగా ప్రస్తావిస్తూ వచ్చారు చిత్ర నిర్మాత , దర్శకులు. దీంతో థియేటర్ కి వచ్చే ప్రేక్షకుడికి ముందే ఓ క్లారిటీ వచ్చేసింది. తాము పెళ్లి గొప్పదనాన్ని చాటే సినిమా చూడబోతున్నామని వారికి అర్ధం అయ్యింది. పెళ్లి కన్నా ముందు పుట్టే ప్రేమ సీన్స్ , హీరో , హీరోయిన్ నేపధ్యాలు గురించి చెప్పే సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఎన్నో సార్లు చూసిన, తెలిసిన సందర్భాలే అయినప్పటికీ సతీష్ వేగేశ్న సంభాషణలు మన జీవితంలో ముఖ్య ఘట్టాల్ని తడిమినట్టు అనిపించాయి. హీరో , హీరోయిన్ ప్రేమ ఇక పెళ్లిపందిరి దగ్గరకు వస్తుంది అనగా పెళ్లికుతురి తండ్రి రూపంలో ఓ ఆటంకం వస్తుందని అంతా ఊహిస్తారు. కానీ ఆయన పెళ్ళికి తేలిగ్గా ఒప్పుకుని తర్వాత రహస్యంగా పెళ్లి కొడుకుతో చేసుకునే ఒప్పందంతో సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో అని ప్రేక్షకుడు వూహించగలడు. అందుకు తగ్గట్టే సెకండ్ హాఫ్ లో పల్లెటూరులో పెళ్ళికి రంగం సిద్ధం అవుతుంది. ఇక అక్కడ నుంచి భావోద్వేగాలు చుట్టూ నడవాల్సిన కథ, కధనం లో పెళ్లి కేంద్ర బిందువు అవ్వాలి. కానీ పెళ్లి గొప్పదనం చెప్పే క్రమంలో అక్కడక్కడా కథ , కథనం ప్రాధాన్యం వెనక్కి పోయిందేమో అనిపిస్తుంది. అంతలోనే బిగువైన సన్నివేశంతో ప్రేక్షకుడు మళ్లీ కధలోకి వస్తాడు. కానీ …
సెకండ్ హాఫ్ లో ఈ ఎత్తుపల్లాలు వచ్చేసరికి సినిమా అంతా పెళ్లి గొప్పదనం గురించి బోధ చేసినట్టు అనిపిస్తుంది. చెప్పే విషయానికి తగ్గట్టు సన్నివేశం బిగువు ఉంటే బాగుండేది అని ప్రేక్షకుడు కొన్ని చోట్ల ఫీల్ అవుతాడు. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకుని ఉంటే ఈ సినిమా రేంజ్ మారిపోయేది. ఆ విషయంలో చేసిన తప్పుతో సినిమాకి ఆయువుపట్టు లాంటి ఇంటర్వెల్ బ్యాంగ్, క్లయిమాక్స్ కూడా అనుకున్న స్థాయిలో పండలేదేమో. చెప్పేది ఎంత గొప్ప విషయం అయినా అది కధలో ఇమిడిపోతే ప్రేక్షకుడు సినిమాతో పాటు , అందులో భావోద్వేగాలతో పాటు ప్రయాణం చేస్తాడు. కానీ ప్రేక్షకుడిని విద్యార్థిలా ఫీల్ అయ్యి పాఠం చెబితే అది ఎంత గొప్ప పాఠం అయినా స్టూడెంట్ ఎంజాయ్ చేయకపోవచ్చు. ఇన్ని చెప్పినా పెళ్లి గురించి దర్శకుడు సతీష్ వేగేశ్న చెప్పిన ఈ తరానికి నిజంగా ఎంతో అవసరం. వీటి మధ్య ఆరోగ్యకరమైన ,ముసున్నితమైన హాస్యం కూడా బాగా పండింది.ఆ రెండు పాయింట్స్ సినిమాకి రక్షగా నిలుస్తాయి.ఇక ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే …హీరో నితిన్ , హీరోయిన్ రాశి ఖన్నా బాగా చేశారు. నితిన్ పాత్ర కి ఫస్ట్ హాఫ్ లో వున్న స్కోప్ సెకండ్ హాఫ్ లో లేకుండా పోయింది. ఇక జయసుధ , ప్రకాష్ రాజ్ , రాజేంద్ర ప్రసాద్, నరేష్ ,సితార లాంటి సీనియర్ ఆర్టిస్ట్స్ బాగా చేశారు. చాన్నాళ్ల తర్వాత వెండితెర మీద కనిపించిన పూనమ్ కౌర్ కూడా బాగా చేసింది. సినిమాలో ప్రతి చిన్న పాత్రకి పెద్ద ఆర్టిస్ట్ ని తీసుకోవడంతో తెరకి ఓ నిండుదనం వచ్చింది. సమీర్ రెడ్డి కెమెరా పనితనం, మిక్కీ జె మేయర్ సంగీతం సినిమాకి హైలైట్. ఇక దిల్ రాజు ప్రొడక్షన్ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా ఈ సినిమా మీద ఆయన తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది.
తెలుగు బులెట్ పంచ్ లైన్ …”శ్రీనివాస కళ్యాణం “…ఓ పెళ్లి నిఘంటువు మాత్రమే, కావ్యం కాదు.
తెలుగు బులెట్ రేటింగ్ ...2 .75 /5 .