Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మనం మాట్లాడేటప్పడు అనేక పొరపాట్లు దొర్లడం సహజం. అయితే ఆ పొరపాట్ల వల్ల అసలు అర్ధం మారకుండా ఉంటే..వచ్చే నష్టం ఏమీ ఉండదు. కానీ కొన్నిసార్లు నోటివెంటన పొరపాటున వచ్చే మాటలు..భయంకర తప్పులయ్యే ప్రమాదముంది. సాధారణంగా…మనకు ఎరినన్నా ఒక పేరు పెట్టి పిలవడం అలవాటు అయ్యాక…అదే పేరుతో మరొకరిని పిలవాల్సివస్తే కష్టంగా ఉంటుంది. మన అలవాటును తొందరగా మార్చుకోలేం. ఈ సమస్య సామాన్య ప్రజలకే కాదు..ప్రముఖులకూ ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వాలు మారినప్పుడు కొత్త నేతల పదవులను, పేర్లను హోదాను గుర్తుబెట్టుకోడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. వార్తలు రాసే జర్నలిస్టులు ప్రభుత్వాలు మారినప్పుడు నేతల పేర్లను, హోదాను సరిగ్గా రాశామా లేదా అని ఒకటికి పదిసార్లుసరిచూసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు తొమ్మిదేళ్లు వరుసగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు…ఆ పదవికి పర్యాయపదమయ్యారు.
ముఖ్యమంత్రి అన్నా సీఎం అన్నా చంద్రబాబే అన్నంతగా నోటెడ్ అయ్యారు. తరువాత 2004 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో…సీఎం గురించిన వార్తలు రాసేటప్పుడు జర్నలిస్టులకు పదే పదే చంద్రబాబు అనే నోటి వెంట వచ్చేంది. న్యూస్ లోనూ అలానే రాసి…తర్వాత సరిచూసుకుని పొరపాటు జరగకుండా జాగ్రత్త పడేవారు. ప్రజలు కూడా సీఎం చెప్పారు…అని వార్తల్లో వస్తోంటే..చంద్రబాబే అని పొరపడిన సందర్భాలు ఉన్నాయి. క్రమంగా వైఎస్ పేరు అందరికీ చేరువయింది. ఇలాంటి ఇబ్బంది…జాతీయ స్థాయి వార్తల్లోనూ ఎదురయింది. 2004 నుంచి 2014 దాకా భారతదేశానికి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నారు. పదేళ్లపాటు మన్మోహన్ అంటే..పీఎం…ప్రధాని అంటే మన్మోహన్ అన్నంతగా ఆయన పేరు జనబాహుళ్యంలో ప్రచారం పొందింది. జర్నలిస్టులయితే మన్మోహన్ పేరు రాయకుండానే..పీఎం వార్తలను వివరించేవాళ్లు.
2014లో కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిచింది. ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. సార్వత్రిక ఎన్నికల ముందు నుంచీ..కాంగ్రెస్ ఓడిపోతుందని, మోడీయే ప్రధాని అవుతారని అందరూ ఊహించినప్పటికీ…అంత తొందరగా మోడీ పేరు నోటెడ్ అవలేదు. పేరున్న జాతీయ చానళ్ల దగ్గరనుంచి, స్థానిక చానళ్ల దాకా అందరూ ప్రధాని మోడీ గురించి చెప్పే సందర్భంలో ఎప్పుడో ఓసారి ప్రధాని మన్మోహన్ అని చెప్పి …తరువాత పొరపాటు దిద్దుకుని జాగ్రత్తపడేవారు. తర్వాత క్రమంగా మన్మోహన్ స్థానంలో మోడీ పేరు వ్యాపితమయింది. ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడెవరూ మోడీ పేరు కన్ ఫ్యూజ్ అవ్వడం లేదు. మన్మోహన్ సింగ్ ప్రధాని అన్న విషయాన్ని అందరూ మర్చిపోయారు. ప్రధాని అనగానే మోడీ పేరే గుర్తుకొస్తోంది.
కానీ తమిళనాడుకు చెందిన ఓ మంత్రి మాత్రం ఇంకా మన్మోహన్ సింగ్ కాలం నుంచి బయటకు రాలేదు. ఇప్పటికీ ఆయనకు ప్రధాని అనగానే మన్మోహన్ సింగే పేరే నోటికొస్తోంది. అలా అనాలోచితంగా ప్రధాని మన్మోహన్ సింగ్ అని ఆ మంత్రి వ్యాఖ్యానించిన వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇటీవలే కొందరు మంత్రులు, అన్నాడీఎంకె నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లి ప్రధానిమోడీని కలిసి వచ్చారు. అయితే ఈ భేటీపై తమిళనాడు రాజకీయాల్లో కలకలం చెలరేగింది. దీంతో పన్నీర్ ఢిల్లీ పర్యటనను సమర్థించే కోణంలో మాట్లాడేందుకు అటవీశాఖ మంత్రి శ్రినివాసన్ ప్రయత్నించారు. రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా పన్నీర్ ఢిల్లీ వెళ్లారని చెప్పే క్రమంలో…శ్రీనివాసన్ పొరపాటు పడ్డారు. ఉపముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి రాష్ట్రాభివృద్ధిపై ప్రధాని మన్మోహన్ సింగ్ తో చర్చించారని శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు. శ్రీనివాసన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.