కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ చాలా మందికి సాయం చేసినప్పటికీ ఎవ్వరికీ చెప్పలేదని, ఆయన మరణం తర్వాతే ఆయన సేవల గురించి అందరికీ తెలిసిందని దర్శకుడు రాజమౌళి అన్నారు. తాజాగా ఆయన పునీత్ రాజ్‌కుమార్ మరణంపై స్పందిస్తూ.. తనకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదన్నారు. ‘ఎన్నో సేవ కార్యక్రమాలు, 1800 పేద విద్యార్థులకు ఉచిత చదువు, పదుల సంఖ్యలో అనాధాశ్రమాలు, ఓల్డేజ్ హోంలు ఏవరూ చేస్తారు ఇలా. ఇంత పెద్ద సాయం చేస్తూ ఎన్నడూ బయటకు చెప్పలేదు. ఓ సాధారణ వ్యక్తిలా కనిపించారు.
పునీత్ చనిపోయాక ఆయన సేవ కార్యక్రమాల గురిచి తెలిసి షాక్ అయ్యాను. అలాంటి గొప్ప వ్యక్తి అందరి మధ్య సాధారణ మనిషిలా ఉన్నారా?’ అంటూ రాజమౌళి భావోద్యేగానికి గురయ్యారు. సాధారణంగా ఎవరైనా చిన్న సాయం చేసినా ప్రపంచానికి తెలిసేలా ప్రచారం చేసుకుంటారని, పునీత్ రాజ్‌కుమార్ మాత్రం అలా కాదని ఆయన అన్నారు. నాలుగు ఏళ్ల క్రితం తాను బెంగళూరుకు వచ్చినప్పుడు పునీత్ రాజ్‌కుమార్‌ను కలిశానని. తనను కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారని చెప్పారు. తనతో ఆయన సరదాగా మాట్లాడారని, ఒక స్టార్‌తో మాట్లాడుతున్నాననే భావనే తనకు కలగలేదని రాజమౌళి పేర్కొన్నారు.