అప్పుడెప్పుడో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు నటించిన పౌరాణిక సినిమాలు ఇప్పటి తరం పెద్దగా చూసి ఉండకపోవచ్చు. మహాభారతం ఆధారంగా ఆయన చేసిన సినిమాల్లో కురుక్షేత్రం ఆఖరి ఘట్టం. అందులో కౌరవ సైన్యంతో పోరాడే అర్జునుడు ముందుగా ప్రత్యర్థి సేనలోని పెద్దలకు, గురువులకు నమస్కార బాణం వేస్తారు. ఆ తర్వాత యుద్ధం చేస్తారు. ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం అదే ఫార్ములా ని ఫాలో అయిపోయారు. నాలుగు రోజుల కిందట రాజకీయ రంగప్రవేశం చేస్తున్నట్టు ప్రకటించిన రజని నిన్న రాత్రి చెన్నై, గోపాలపురంలోని కరుణానిధి ఇంటికి వెళ్లారు. కరుణ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న రజని ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. రాజకీయాల్లో కి అడుగు పెడుతున్న సందర్భంగా కరుణ ఆశీస్సులు తీసుకున్నారు. కరుణ ఇంటిలోకి రజని గడిపిన పావుగంటసేపు డీఎంకే సారధి స్టాలిన్ ఆయన వెంటే వున్నారు.
రజని అటు వెళ్ళిపోగానే స్టాలిన్ ఆయన మీద విమర్శల దాడి చేశారు. రజని చెప్పిన ఆధ్యాత్మిక రాజకీయం అన్న మాటని టార్గెట్ చేశారు. రజని రాజకీయం వెనుక బీజేపీ ఉందన్న ఉద్దేశంతో స్టాలిన్ మాట్లాడారు. ద్రవిడ సిద్ధాంతాల్ని పక్కకు నెట్టి ఆధ్యాత్మిక రాజకీయం చేయాలి అనుకునే వాళ్ళు కరుణ ఆశీస్సుల కోసం రావడం మీద కూడా స్టాలిన్ అభ్యంతరం తెలిపారు. ద్రవిడ సిద్ధాంతాన్ని దెబ్బ తీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు సఫలం కాబోవని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కుట్రలు గమనిస్తున్న తమిళులకు ఎవరిని ఆదరించాలో తెలుసుకునే సత్తా ఉందన్నారు. తమిళుల నరనరాల్లో జీర్ణించుకుపోయిన ద్రావిడ సిద్ధాంతాన్ని పక్కకు నెట్టే శక్తి రజనికి మాత్రమే కాదు రాబోయే తరాలకు కూడా లేదని స్టాలిన్ చెప్పారు.
మొత్తానికి రజని రాజకీయ రంగప్రవేశం వెనుక బీజేపీ ఉందన్న ప్రచారంలో డీఎంకే కూడా భాగస్వామి అయ్యింది. పైగా రజని రాజకీయ రంగ ప్రవేశం ప్రకటన రాగానే ఆయన తమిళుడు కాదు అన్న కోణంలో ప్రత్యర్థుల రాజకీయం నడుస్తుందని అంతా అనుకున్నారు. అయితే అందుకు భిన్నంగా రజని ఎప్పుడైతే ఆధ్యాత్మిక రాజకీయం అన్న మాట వాడారో అప్పటి నుంచి ఆయన తమిళేతరుడు అన్న టాపిక్ పక్కకి పోయింది. రజని వెనుక బీజేపీ ఉందన్న ప్రచారానికే ప్రత్యర్ధులు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే 2 జి కేసు తీర్పుతో తమిళుల బీజేపీ విషయంలో డీఎంకే ని కూడా అనుమానంగానే చూస్తున్నారు. దీంతో స్టాలిన్ మాటలకు ఏ మాత్రం విలువ ఉంటుందో చూడాలి.