భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు నేపథ్యంలో గురువారం ఆయనను ప్రత్యేకంగా సన్మానించారు. సమావేశ మం దిరంలోకి మోదీ ప్రవేశిస్తుండగా సభ్యులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనుల మధ్య ఆయనకు స్వాగతం పలికారు.
పార్టీ సభ్యులంతా మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ నినాదాలు చేశారు. పార్టీ జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా ప్రధానిని సత్కరించారు. ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా మూడింట్లో గెలిచిన విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణలోనూ ఓట్ల శాతం, సీట్ల సంఖ్యలో పార్టీ పురోగతి సాధించింది. మోదీ నాయకత్వం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో నెలకొంది. పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో తమ లోక్సభ, రాజ్యసభలోని పార్టీ సభ్యులతో భాజపా ప్రతివారం భేటీ అవుతుంది. దీంట్లో మోదీ, అమిత్ షా, నడ్డా సహా ఇతర కీలక నేతలు పాల్గొని అజెండా, వ్యూహాలపై సభ్యులకు మార్గనిర్దేశం చేస్తారు.