Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చైనా చెప్పినట్టుగానే ఆ దేశ అంతరిక్ష ప్రయోగ కేంద్రం స్పేస్ ల్యాబ్ తియాంగాంగ్ -1 భూమికి ఎలాంటి నష్టం కలిగించకుండా సముద్రంలో పడిపోయింది. స్పేస్ లాబ్ శకలాలు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయినట్టు చైనా అంతరిక్ష అధికారులు వెల్లడించారు. 8 టన్నుల బరువుగల ఈ స్పేస్ ల్యాబ్ శకలాలు ఎక్కువ శాతం గాల్లోనే మండిపోయినట్టు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక 15 నిమిషాలకు దక్షిణ పసిఫిక్ ప్రాంతంలో భూ వాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే మంటలు చెలరేగినట్టు అధికారులు చెప్పారు. 10.4 మీటర్ల పొడవున్న తియాంగాంగ్ -1ను 2011లో చైనా ప్రయోగించింది. రెండేళ్లపాటు సేవలు అందించేలా దీనిని రూపొందించారు. 2013 జూన్ నాటికి ఈ ల్యాబ్ ప్రధాన లక్ష్యాలన్నీ నెరవేరాయి. 2016 మార్చి నుంచి దాని సేవలు ఆగిపోయాయి. ఆ తర్వాత నెమ్మదిగా నియంత్రణ కోల్పోయింది. జీవితకాలం పూర్తయి,నియంత్రణ కోల్పోయిన ఈ స్పేస్ ల్యాబ్ 2017 చివరిలో కూలిపోతుందని అంతా భావించారు.
అయితే అది ఆలస్యమవుతూ వచ్చింది. చివరకు మార్చి నెలాఖరులో కానీ, ఏప్రిల్ మొదటివారంలో కానీ కూలిపోనుందని చైనా ప్రకటించింది. దీంతో అది భూమి మీద ఎక్కడ పడుతుందోనని అందరూ ఆందోళన చెందారు. స్పేస్ ల్యాబ్ వల్ల భూమికి నష్టం కలిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని చైనా అధికారులు ముందుగానే స్పష్టంచేసినప్పటికీ… ప్రపంచవ్యాప్తంగా దీనిపై తీవ్ర చర్చ జరిగింది. రెండురోజులుగా ప్రజల్ని భయాందోళనలకు గురిచేస్తూ వార్తలొచ్చాయి. చివరకు ఇది దక్షిణ పసిఫిక్ ప్రాంతంలో భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. స్పేస్ ల్యాబ్ ఘటనలో ప్రపంచమీడియా వ్యవహరించిన తీరును చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ దుమ్మెత్తిపోసింది. తియాంగాంగ్ -1 కూలిపోతుందన్న వార్తలకు ప్రపంచ మీడియా అధిక ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శించింది. చైనా స్పేస్ ఇండస్ట్రీని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించింది. అదో సాధారణ స్పేస్ క్రాప్ట్ మాత్రమేనని, అయినప్పటికీ అధిక ప్రాధాన్యం ఇచ్చారని, ఏరోస్పేస్ ఇండస్ట్రీలో శరవేగంగా ఎదుగుతున్న చైనాపై బురదజల్లేందుకు పాశ్చాత్య దేశాలు ప్రయత్నించాయని మండిపడింది.