ప్రతి ఒక్కరి సహకారంతో లాక్‌డౌన్ సమర్థవంతంగా అమలవుతుందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా పోలీసులు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతిరోజు సీఎం కేసీఆర్ లాక్‌డౌన్ పరిస్థితులపై సమీక్ష చేస్తున్నారని, చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటలూ పరిస్థితిని సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు.
‘‘20 వేల మందికి ఈ పాసులు జారీ చేశాం. అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలి. కోవిడ్ కట్టడిని అడ్డుకునేందుకే ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ప్రజలు కూడా లాక్‌డౌన్‌కు సహకరించాలి. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రజలకు వెసులుబాటు కల్పించాం. చిన్న కారణాలతో ప్రజలు బయటకు వచ్చి ఇబ్బందులు కలిగించొద్దు. ఈ-పాసులను కొందరు మిస్ యూజ్ చేస్తున్నారు.
ఈ-పాస్‌లను అనవసరంగా వాడితే వాహనాలను సీజ్ చేస్తున్నాం. 3 కమిషనరేట్‌ల పరిధిలో చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు జరుగుతున్నాయి. ప్రతి జోన్‌లో పోలీసుల టీమ్ ఉంది. బ్లాక్‌మార్కెట్‌లో ఇంజక్షన్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. బ్లాక్‌మార్కెట్‌లో ఇంజక్షన్లు అమ్మితే 100కు ఫోన్ చేయాలని’’ సీపీ తెలిపారు.
94.5 శాతం పోలీసు అధికారులకు వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిందని ఆయన తెలిపారు. ప్రతి హైవేలో సీనియర్ పోలీసు అధికారి నేతృత్వంలో పర్యవేక్షణ ఉందని పేర్కొన్నారు. అంతర్రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వస్తున్న రోగులకు అనుమతిస్తున్నామన్నారు. అంబులెన్స్‌లకు ఎలాంటి ఇబ్బందులు కలిగించడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలనే మేం పాటిస్తున్నామన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు ప్రజల భద్రత, ఆరోగ్యమే తమకు ముఖ్యమని సీపీ అంజనీకుమార్ అన్నారు.