Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్నాటక ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్లను శాసించాయి. ఎన్నికల ఫలితాల్లో మార్పుకు తగ్గట్టుగా మార్కెట్లు లాభనష్టాలు నమోదుచేశాయి. తొలుత కర్నాటకలో హంగ్ వస్తున్న సూచనలు కనిపిస్తున్న తరుణంలో ఈ ఉదయంసెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కాసేపటికే బీజేపీ వందకు పైగా స్థానాల్లో దూసుకుపోవడంతో మార్కెట్లు జోరందుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా… నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభాలతో ట్రేడ్ అయ్యాయి. అయితే మార్కెట్ల జోరు ఎక్కువసేపు నిలవలేదు. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఆరంభలాభాలు కొంత కోల్పోయాయి.
ఇక మధ్యాహ్నం రెండు గంటల తర్వాత బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోలేదని, కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశముందని వచ్చిన వార్తలతో… ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. దీంతో ఆరంభ లాభాలను పూర్తిగా కోల్పోయిన మార్కెట్లు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. సెన్సెక్స్ 13 పాయింట్లు కోల్పోయి 35,544 వద్ద ముగియగా… నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 10,802వద్ద స్థిరపడింది. మొత్తానికి బీజేపీ గెలుస్తుందనుకుని అమాంతంగా పైకి ఎగబాకిన మార్కెట్లు..ఆ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో….నష్టాల్లో ముగిశాయి.