Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తూత్తుకుడి దారుణంలో పోలీసుల అనుచిత వైఖరికి సంబంధించిన ఆధారాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. కాల్పులు జరుగుతున్న సమయంలో ఓ పోలీస్ అధికారి బస్సు పైకి ఎక్కి కనీసం ఒక్కరైనా చావాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియో బుధవారమంతా సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఇవాళ మరో పోలీస్ అధికారి దారుణ వ్యాఖ్యల వీడియో బయటకు వచ్చింది. ఆందోళన చేస్తున్న ప్రజలపై పోలీసులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 22 ఏళ్ల కలియప్పన్ అనే యువకుడికి బుల్లెట్ తగిలి తీవ్రగాయమైంది. బాధ భరించలేక కలియప్పన్ అక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపుమడుగులో పడిఉన్న కలియప్పన్ దగ్గరికి ఓ పోలీస్ అధికారి వచ్చాడు. అతన్ని కనీసం ఆస్పత్రికయినా తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. అంతేకాకుండా కలియప్పన్ ను నటించింది చాలు ఇక వెళ్లు అని కసురుకున్నాడు. సమయానికి ఆస్పతికి తీసుకెళ్లకపోవడంతో కలియప్పన్ అక్కడికక్కడే చనిపోయాడు. పోలీస్ అధికారి కలియప్పన్ ను నటించింది చాలు ఇక వెళ్లు అనడాన్ని అక్కడే ఉన్న ఓ రిపోర్టర్ వీడియో తీశాడు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పోలీసుల తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తంచేస్తున్నారు. కాల్పులకు ఆదేశాలిచ్చింది తమిళనాడు డీజీపీ రాజేంద్రన్ అని ప్రచారం జరుగుతోంది. అటు ముందస్తు హెచ్చరికలు లేకుండా ప్రజలపై కాల్పులు జరిపినందుకు గానూ తూత్తుకుడి జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారిపై బదిలీ వేటు పడింది. కొత్తగా కలెక్టర్ గా సందీప్ నండూరి బాధ్యతలు చేపట్టారు. తూత్తుకుడిలో సాధారణ పరిస్థితులు నెలకొల్పడమే తన మొదటి ప్రాధాన్యమని తెలిపారు. కాల్పులకు ఆదేశాలు ఇచ్చింది ఎవరన్నది తమిళనాడు ప్రభుత్వం నియమించిన జడ్జి విచారణలో తేలుతుందన్నారు. మరోవైపు తూత్తుకుడిలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఐదురోజుల పాటు ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. పోలీసులు ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహిస్తూ యువకులను పట్టుకుని తీసుకువెళ్తున్నట్టు సమాచారం. తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ కు విద్యుత్ నిలిపివేయాలని ఆదేశించింది.