సీట్ల లొల్లి….దద్దరిల్లుతున్న గాంధీ, ఎన్టీఆర్ భవన్ లు…!

Strike At Gandhi Bhavan And Ntr Bhavan Over Mla Tickets

రెండ్నెల్ల క్రితమే అభ్యర్ధులని ప్రకతిన్చీన టీఆరెస్ రెండో విడత ప్రచారం మొదలుపెట్టగా దానిని ఓడించాలని భావిస్తూ రెడీ అయిన మహాకూటమిలో మాత్రం సీట్ల లొల్లి ఇంకా కొనసాగుతూనే ఉంది.కాంగ్రెస్ పార్టీకి కేటాయిస్తే టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. టీడీపీ కి కేటాయిస్తే కాంగ్రెస్ నేతలు నిరసనలకు దిగుతున్నారు. పార్టీల మధ్య ఇంకా స్థానాల విషయంలో ఏకాభిప్రాయం రానేలేదు పైగా అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. అయినప్పటికీ కొందరు నేతలు తొందరపడి చేసే అల్లర్లు మొదలుపెట్టారు. ప్రస్తుతం గాంధీ భవన్,ఎన్టీఆర్‌ భవన్‌ నిరసనలతో దద్దరిల్లుతున్నాయి.నిన్న మల్కాజ్‌గిరి టికెట్ టీజేఎస్‌కు కాకుండా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్‌‌కు ఇవ్వాలంటూ గాంధీభవన్‌ ఎదుట కార్యకర్తలు ఆందోళనకు దిగగా, ఈరోజు ఖానాపూర్ కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు.

ntr-bhavan

ఖానాపూర్‌ టికెట్‌ రమేష్‌ రాథోడ్‌ కు ఇస్తారన్న వార్తలపై వారు ఆందోళన చేపట్టారు. రమేష్‌ రాథోడ్‌కు టికెట్‌ ఇవ్వొద్దంటూ నినాదాలు చేశారు. వీరితో చర్చలు జరిపి నిరసనను విరమింపజేసేందుకు పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, గూడూరు నారాయణరెడ్డి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్‌ భవన్‌ ఎదుట తెదేపా నేతలు ఈ ఉదయం ఆందోళనకు దిగారు. మహాకూటమి పొత్తులో భాగంగా ఎల్‌బీనగర్‌ నియోజకవర్గాన్ని కాంగ్రెస్‌కు కేటాయించవద్దని తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఎల్బీనగర్‌ టికెట్‌ను తమకే కేటాయించాలని సామ రంగారెడ్డి వర్గీయులు నినాదాలు చేశారు. గత ఎన్నికల్లో ఇక్కడ మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌కు ఎలా ఈ నియోజకవర్గాన్ని కేటాయిస్తారంటూ ప్రశ్నించారు.

gandhi-bhavan

తాము ఈ నియోజకవర్గంలో పార్టీని కాపాడుకున్నామని.. అలాంటి స్థానాన్ని వేరే పార్టీకి కేటాయిస్తామంటే ఒప్పుకోమని స్పష్టం చేశారు. ఈ టికెట్‌ను తమకే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సామ రంగారెడ్డితోపాటు ఆయన అనుచరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన ఆర్.క్రిష్ణయ్య ఇక్కడ గెలుపొందారు. కానీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధీర్ రెడ్డి ఎల్‌బీనగర్‌ లో ప్రచారం కూడా ప్రారంభించారు. ఇలా అల్లర్లు జరిగితే ప్రజల్లోకి కూటమి మీద వ్యతిరేక సంకేతాలు తీసుకెళ్లే అవకాశం ఉంది.

r-krishnayya