అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఈసారి ఏకంగా పాఠశాలలోనే కాల్పులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆరో తరగతి చదువుతున్న బాలిక పాఠశాలకు తుపాకీతో వచ్చింది. వచ్చి రాగానే తన తోటి విద్యార్థులపై కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఆమె టీచర్‌ను భద్రతా దళాలు వచ్చేంతవరకు తుపాకీతో పట్టుకుందని సమాచారం.
అమెరికాలోని ఇదోహ రాష్ట్రంలో రిగ్బి మిడిల్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న బాలిక తుపాకీతో పాఠశాలకు వచ్చింది. అదును చూసి తనతో తెచ్చుకున్న తుపాకీతో కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లో తన తోటి విద్యార్థులు ఇద్దరు, పాఠశాల సిబ్బంది ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులతో ఒక్కసారిగా పాఠశాలలో కలకలం రేపింది. వెంటనే స్పందించిన నిర్వాహకులు పెద్ద ప్రమాదం జరగకుండా అడ్డుకున్నారు.
అయితే బాలిక పోలీసులు వచ్చేదాక కూడా టీచర్‌తో తుపాకీతో నిర్బంధించిందని అక్కడి స్థానిక మీడియా తెలిపింది. గన్‌తో పాఠశాల లోపల, బయట పలు రౌండ్లు కాల్పులు జరిపింది. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. అయితే బాలిక తుపాకీ ఎందుకు పాఠశాలకు తీసుకొచ్చిందో తెలియడం లేదు. ఇంత చిన్న వయసులో గన్ కల్చర్‌కు అలవాటు పడడంతో ఆందోళన రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.