ప్రేమ విఫలం కావడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. రొళ్ల మండలం జీజీ హట్టి గ్రామానికి చెందిన వరుణ్‌యాదవ్.. మడకశిరలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్న తల్లి అమ్మజక్క అతి కష్టంపై కుమారుడిని చదివించుకుంటోంది. రోజూ బస్సులో కళాశాలకు వెళ్లి వచ్చే క్రమంలో పరిచయమైన విద్యార్థిని పట్ల ప్రేమ పెంచుకున్న అతను.. ఆమె నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యాడు.
గురువారం ఉదయం కళాశాలకు వెళ్లి వస్తానని తల్లితో చెప్పి బయలుదేరిన వరుణ్ యాదవ్.. రొళ్ల సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న గోవిందప్ప బావి వద్ద చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న మడకశిర సీఐ శ్రీరామ్, గుడిబండ ఎస్‌ఐ సురేష్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, భర్త నిరాదరణకు గురై ఉన్న ఒక్కగానొక్క కుమారుడి ఉజ్వల భవిష్యత్తు కోసం పరితపించిన తల్లి విలపించిన తీరు అందరి చేత కన్నీరు పెట్టించింది.