ఆన్‌లైన్ తరగతుల కోసం స్మార్ట్‌ఫోన్ కొనివ్వడం లేదని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్మార్ట్‌ఫోన్ కొనిచ్చే ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. ఎస్సై మనోహర్‌రావు వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం కొల్వాయి గ్రామానికి చెందిన ఆకుల రాజేశం, శంకరవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. రాజేశం గీత వృత్తితో పాటు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
తల్లి బీడీలు చుడుతూ ఆసరాగా ఉంటోంది. చిన్న కుమారుడు సాయిరాం (15) గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం ఆన్‌లైన్ తరగతులు కొనసాగుతుండటంతో స్మార్ట్‌ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరాడు. ఆర్థిక స్థోమత లేదని, ఇప్పుడు వద్దని తల్లిదండ్రులు వారించారు. దీంతో మనస్తాపం చెందిన సాయిరాం తమ పాత ఇంట్లో ఉరేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.