నగరంలోని జననీ ఆస్పత్రి రోడ్డులోని హేమచంద్ర లాడ్జిలో విద్యార్థి సంఘ నాయకుడు నీలకంఠ మహాపాత్రో ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. లాడ్జి యజమాని ద్వారా ఈ విషయం తెలుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని ఎంకేసీజీ ఆస్పత్రికి మృతదేహం తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. బీఎన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చంద్రప్రభా వీధికి చెందిన నీలకంఠ మహాపాత్రో 2020 డిసెంబరు 21వ తేదీ లాడ్జిలోనే ఉంటున్నారు. అయితే రాత్రంతా రూమ్‌లోని లైట్లు వేసి ఉండడం, ఫ్యాన్ తిరుగుతుండడం గమనించి, అనుమానం వ్యక్తం చేసిన లాడ్జి యజమాని పోలీసులకు సమాచారం అందించారు.
ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు లాడ్జి తలుపులు పగలగొట్టి చూడగా, నీలకంఠ మహాపాత్రో శవం కనిపించింది. అయితే అతడు చనిపోవడానికి గల కారణాలు తెలియకపోగా, గత కొన్నాళ్ల నుంచి అతడు మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అతడు ఆత్మహత్యకి పాల్పడి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. 1989–90 మధ్య కాలంలో కళ్లికోట్ కళాశాల విద్యార్థి సంఘ నాయకుడిగా పనిచేసిన నీలకంఠ మహాపాత్రో జాతీయ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడిగా మంచి గుర్తింపు పొందారు. అయితే దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి ఆత్మహత్యకి గల కారణాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.