ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు తరగతి గదిలోనే పెళ్లి చేసుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జూనియర్ కళాశాలలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇంటర్మీడియట్ సెకండియర్ ఎంపీసీ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గతనెల 17న తరగతి గదిలోనే తూతూమంత్రంగా వివాహం చేసుకున్నారు. మూడు ముళ్లు వేసి బొట్టు పెట్టి పెళ్లి చేసుకున్న తతంగం మొత్తాన్ని వీడియో తీసుకున్నారు.
ఇది కాస్తా వైరల్‌గా మారడంతో కాలేజీ ప్రిన్సిపల్ వారికి టీసీ ఇచ్చి పంపించేశారు. అయితే ఇది నిజమైన పెళ్లికాదని, సోషల్ మీడియాలో లైకుల కోసం మాత్రమే చేశామని విద్యార్థులు చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విద్యార్థుల పేరేంట్స్‌కు సమాచారం ఇచ్చామని తెలిపారు. అయితే విద్యార్థులు చేసిన పనితో వారి తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. చదువుకోవాల్సిన వయస్సులో ఇలాంటి పిచ్చి పనులు చేయడమేంటని తలపట్టుకుంటున్నారు. చదువుకోమని కాలేజీ పంపిస్తే తమ పరువును ఇలా బజారుకీడుస్తారా అంటూ వాపోతున్నారు.