హాస్టల్స్ వెంటనే ఖాళీ చేయాలని చెప్పిన నిర్వాహకులు

హాస్టల్స్ వెంటనే ఖాళీ చేయాలని చెప్పిన నిర్వాహకులు

తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. జనాలు రోడ్లపైకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. సాయంత్రం ఏడు గంటల నుంచి వేకువజాము వరకు కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. మొదటి రెండు రోజులు రోడ్లపైకి వచ్చిన జనాలు.. పోలీసుల ట్రీట్మెంట్ దెబ్బకు వెనక్కు తగ్గారు. కానీ అక్కడక్కడా జనాలు రోడ్లపైకి వస్తూనే ఉన్నారు.. గుమ్మి గూడుతున్నారు. పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది.

లాక్‌డౌన్ సంగతి అలా ఉంటే హైదరాబాద్‌లో బ్యాచిలర్స్‌కు కొత్త కష్టాలు వచ్చాయి. లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో.. హాస్టల్స్‌ మూతపడుతున్నాయి. హాస్టల్స్ వెంటనే ఖాళీ చేయాలని నిర్వాహకులు ఆదేశించారు. దీంతో యువతి, యువకులు ఇబ్బందులు పడుతున్నారు. అటు హాస్టల్స్‌లో ఉండటానికి వీల్లేక.. ఇటు సొంత ఊళ్లకు వెళ్లలేక రోడ్డుపై నిలబడ్డారు. వారంతా సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లకు క్యూ కట్టారు. తాము సొంత ఊర్లకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.

ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చబౌలి ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. పోలీసులు కూడా ఈ సమస్యపై గందరగోళంలో ఉన్నారు. వీరిని సొంత ఊర్లకు ఎలా పంపించాలనే అంశంపై ఫోకస్ పెట్టారు.. అధికారులతో చర్చిస్తున్నారు. యువతీ, యువకులకు ఒక్కసారి ప్రయాణం చేసేలా పాస్‌లు ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు. పాస్ ఇచ్చినా వారు ఊర్లకు ఎలా వెళ్లానదే అర్ధంకాక అయోమయంలో ఉన్నారు.