Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒక వైపు పవన్ సినిమాలకు గుడ్ బై చెబితే మరో వైపు కాంగ్రెస్ ఎంపీ టి సుబ్బిరామిరెడ్డి మాత్రం తాను త్వరలోనే పవన్ మరియు చిరంజీవిలతో ఒక మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తాను అంటూ ప్రకటించాడు. చాలా నెలల క్రితం తప్పకుండా తాను చిరంజీవి, పవన్‌లు హీరోలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను చేస్తాను అంటూ మెగా ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చాడు. అప్పుడు ఆయన మాటలు ఎవరు నమ్మలేదు. ఆ తర్వాత కథ చర్చలు జరుగుతున్నాయని చెప్పిన సమయంలో కాస్త ఆశ కలిగింది. కాని పవన్ మాత్రం తాను నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలను కొట్టి పారేశాడు. చిరంజీవి కూడా ఇద్దరం కలిసి నటించే ఆలోచన లేదు అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో టీఎస్సార్ తన మాట మార్చాడు. మల్టీస్టారరే కాని చిన్న మార్పు అంటూ తాజాగా ప్రకటన చేశాడు.
తాను నిర్మించబోతున్న చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్లో కనిపిస్తాడు, ఒక కీలక పాత్రలో పవన్ నటిస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు. గతంలో ఎన్నో మంచి చిత్రాలు నిర్మించిన టీఎస్సార్ త్వరలోనే చిరంజీవిని ఒప్పించే అవకాశం ఉంది, ఆ సినిమాలో పవన్‌ను గెస్ట్‌గా చూపించి ఇదే మల్టీస్టారర్ అంటాడేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కనీసం అలా కనిపించినా కూడా మెగా ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఇద్దరు మెగా బ్రదర్స్ చివరగా శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో క్లైమాక్స్ సీన్ కోసం కలిసి నటించారు. మళ్లీ అప్పటి నుండి వీరిద్దరు స్క్రీన్‌పై కలిసి కనిపించింది లేదు.