Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాట వేధింపు, కక్ష సాధింపు రాజకీయాలు కొత్త కాదు. ఈ వ్యవహారం ఒకప్పుడు డీఎంకే, అన్నాడీఎంకే లాంటి ప్రాంతీయ పార్టీలకు మాత్రమే పరిమితం అనుకుంటే మోడీ ప్రధాని అయ్యాక కేంద్ర పగబడితే ఎలా ఉంటుందో తమిళ రాజకీయ నేతలకు అర్ధం అయ్యింది. శశికళ అండ్ కో మీద ఇప్పటికి ఎన్ని ఐటీ దాడులు, ఈడీ దాడులు జరిగాయో చూస్తూనే వున్నాం. ఆ తరహా దాడులు మున్ముందు రజని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందా ? తమిళనాడు బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యలు చూస్తుంటే ఆ సందేహం రాక మానదు.
రజనీకాంత్ అంటే మీడియా మేనేజ్ మెంట్ తప్ప ఇంకేమీ లేదు. అతను మనతో వుండడన్న విషయాన్ని బీజేపీ గుర్తించాలి. రజని రాజకీయాల్లోకి రావడం హాస్యాస్పదం. మనకి సీరియస్ నెస్ కావాలి. తమిళ ప్రజలు రాజకీయాల నుంచి సినిమా స్టార్స్ ని తరిమికొట్టాలని భావిస్తున్నారు. రజని తప్పుడు వేదిక , సమయంలో రాజకీయాల్లోకి వస్తున్నారు. భవిష్యత్ లో తనపై వచ్చే బ్లాక్ మనీ కేసుల గురించి రజని భయపడాల్సి ఉంటుంది. తమిళ ప్రజలు రజని ఫాన్స్ పాడే పాటల మోజులో పడకూడదు. సినిమా ఫాన్స్ రాజకీయాలకు సరిపోరు.
రజనీకి చదువు లేదు. ఆయన మనకు ఏమి చెబుతాడు. సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి రావడం పాత వ్యవహారం. రజనీకి నేను ఎప్పుడూ వ్యతిరేకమే. రాజకీయాల నుంచి సినిమా వాళ్ళని తిప్పికొట్టినప్పుడే తమిళనాడు ప్రతిష్ట పెరుగుతుంది. “ అంటూ సుబ్రమణ్యస్వామి చేసిన కామెంట్స్ లో మిగిలిన విషయాలు కొత్త కాకున్నా రజని బ్లాక్ మనీ కేసులు గురించి బాధపడాలి అనడం మాత్రం ఆయన ఫాన్స్ ని రెచ్చగొట్టేలా వుంది. ఈ మాటలు చూస్తే రజని కూడా తమకు అనుకూలం కాదనుకుంటే కేసులతో వేధించడానికి బీజేపీ రెడీ అవుతోందన్న అనుమానాలు వస్తున్నాయి.