రాహుల్ గాంధీ హిందువ‌ని నిరూపించుకోవాలి

Subramanya Swamy comments on Rahul Gandhi Caste

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బీజేపీ నేత సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి రాజ‌కీయ‌నేత‌ల‌పై చేసే విమ‌ర్శ‌ల్లో చాలా వ‌ర‌కూ నిజాలుంటాయి. తీవ్ర విమ‌ర్శ‌లుగా, న‌మ్మ‌శ‌క్యం కానివిగా అనిపించిన‌ప్ప‌టికీ… అనేక సంద‌ర్భాల్లో ఆయ‌న ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని తేలింది. కొన్ని విష‌యాల్లో సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి చేసే పోరాటాలు రాజ‌కీయ నేత‌ల‌ను జైళ్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగేలా చేసింది కూడా. త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత అక్ర‌మాస్తుల వ్య‌వ‌హారం వెలుగుచూసింది సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి ద్వారానే. ఒక‌ర‌కంగా బెంగ‌ళూరులో జ‌య‌ల‌లిత శిక్ష అనుభ‌వించ‌డానికి సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామే కార‌ణం. అలాగే ఆయ‌న లేవ‌నెత్తిన నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక కేసు విష‌యంలో కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు, కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కోర్టుల చుట్టూ తిరగాల్సి వ‌చ్చింది. ఆయ‌న ఏం మాట్లాడినా ఆధారాలు ఉంటేనే మాట్లాడ‌తారు. త‌ను చేసిన ఆరోప‌ణ‌ల‌ను నిరూపించి తీరుతారు. తాజాగా సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి మ‌రోసారి రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు.

గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్నారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాహుల్ అనేక ఆల‌యాల‌ను సంద‌ర్శించి పూజ‌లు నిర్వ‌హించారు. కాంగ్రెస్ హిందువుల‌కు వ్య‌తిరేకం అన్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే రాహుల్ ఆల‌యాల‌ను సంద‌ర్శిస్తున్నార‌ని బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి కూడా రాహుల్ గాంధీపై తీవ్ర విమ‌ర్శ చేశారు. రాహుల్ గాంధీ తాను హిందువునే అని ముందుగా నిరూపించుకోవాల‌ని స‌వాల్ విసిరారు. రాహుల్ క్రిస్టియ‌న్ అని త‌న‌కు అనుమానంగా ఉంద‌ని, సోనియాగాంధీ అధికారిక నివాస‌మైన టెన్ జ‌న్ ప‌థ్ లో చ‌ర్చి కూడా ఉంద‌ని సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి ఆరోపించారు. ఆధారాల‌తో ఆరోప‌ణ‌లు చేసే సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్య‌లు రావ‌డంతో ఇప్పుడంద‌రికీ రాహుల్ గాంధీ హిందువేనా… అన్న సందేహాలు త‌లెత్తుతున్నాయి.

నిజానికి గాంధీ, నెహ్రూ వార‌సులుగా, బ్రాహ్మ‌ణులుగా చెలామ‌ణి అవుతున్న‌ప్ప‌టికీ… రాహుల్ కుటుంబంలో అనేక మ‌తాలు క‌లిసి ఉన్నాయి. నెహ్రూ కుమార్తె అయిన ఇందిరాగాంధీ పార్శీ తెగ‌కు చెందిన ఫిరోజ్ గాంధీని పెళ్లిచేసుకున్నారు. ఆమె కుమారుడైన రాజీవ్ గాంధీ క్రిస్టియ‌న్ అయిన సోనియాగాంధీని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వారి కుమార్తె ప్రియాంక గాంధీ కూడా క్రిస్టియ‌న్ వ‌ర్గానికే చెందిన రాబ‌ర్ట్ వాద్రాని వివాహం చేసుకున్నారు. ద‌శాబ్దాల నుంచి భార‌త్ లోనే ఉంటున్నా… హిందూ కుటుంబానికి కోడ‌లుగా వ‌చ్చినా సోనియా మ‌తం విష‌యంలో త‌న ఆచారాలు పోగొట్టుకోలేద‌ని, ఆమె ఇప్ప‌టికీ క్రిస్టియానిటీనే న‌మ్ముతార‌ని స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతుంటాయి. టెన్ జ‌న్ ప‌థ్ లో చ‌ర్చి ఉంద‌న్న సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి వ్యాఖ్య‌లు చూస్తే… ఆ మాట‌లు నిజ‌మే అనిపిస్తుంది. ఆ క్ర‌మంలోనే రాహుల్ గాంధీ కూడా క్రిస్టియ‌న్ గా ఉన్నారా… లేక హిందూ మ‌తాన్ని అనుస‌రిస్తున్నారా అన్న‌దానిపై ఎవ‌రికీ స్ప‌ష్ట‌త లేదు. ఇప్పుడు సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి ఈ అనుమానాన్ని లేవ‌నెత్త‌డంతో ఇక దేశంలో ఇది చ‌ర్చ‌నీయాంశం కానుంది.