సురేశ్ రైనా.. టీమిండియా తరపున 15 ఏళ్ల పాటు(2005-2020) అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. జట్టులోకి వచ్చిన అనతి కాలంలోనే మంచి బ్యాట్స్‌మన్‌గా పేరుపొందిన రైనా టీమిండియాకు ఎన్నో కీలక విజయాలు అందించాడు. అంతేగాక రైనాలో మంచి ఫీల్డర్ ఉన్నాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే రైనాకు ఆటతో పాటు సినిమాలంటే కూడా ఇష్టమని చాలా ఇంటర్య్వూల్లో పేర్కొన్నాడు. అయితే తాను ఒక్క హీరోను మాత్రమే ఇష్టపడతానని.. అతని సినిమాలు తప్ప వేరేవి చూడడని కొన్ని సందర్భాల్లో రైనా చెప్పుకొచ్చాడు.
స్వతహాగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించే రైనా అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తుంటాడు. అతనికి ట్విటర్‌లో 18.8 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా.. రైనా మాత్రం 894 మందిని మాత్రమే ఫాలో అవుతాడు. ఆ 894 మందిలో కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ కూడా ఉన్నాడు. రైనాకు సుదీప్ అంటే ప్రాణం.. అతని యాక్టింగ్ నచ్చి వీరాభిమానిగా మారిపోయిన రైనా అతని సినిమాలను మిస్ కాకుండా చూస్తాడు.
కాగా టీమిండియా తరపున రైనా 18 టెస్టుల్లో 768 పరుగులు, 226 వన్డేల్లో 5615 పరుగులు, 78 టీ20ల్లో 1605 పరుగులు సాధించాడు. టీమిండియా తరపున మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించి తొలి ఇండియన్ ఆటగాడిగా రైనా రికార్డు సృష్టించాడు. కాగా గతేడాది ఆగస్టు 15న ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కాసేపటికే రైనా తన క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పడం విశేషం.
కాగా 2011లో ప్రపంచకప్ సాధించిన జట్టులో రైనా సభ్యుడు. ఇక గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్‌కు దూరంగా ఉన్న రైనా ఈ సీజన్‌కు మాత్రం అందుబాటులోకి వచ్చాడు. ఐపీఎల్ 14వ సీజన్‌లో సీఎస్‌కే తరపున 7 మ్యాచ్‌లాడి 123 పరుగులు సాధించాడు. అయితే కరోనా సెగతో లీగ్‌ను బీసీసీఐ మధ్యలోనే రద్దు చేసింది.