కూటమి హ్యాండ్ ఇచ్చింది…అందుకే ఉత్త్తమ్ మీదే పోటీ

Sudhakar Is Ready To Contest On Uttamkumar Reddy

టీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలతో పాటు తెలంగాణ ఇంటి పార్టీ కూడా చేరిన విషయం తెలిసిందే. ఇంటి పార్టీకి కాంగ్రెస్ ఒక టిక్కెట్ కేటాయించిందని, ఇంటి పార్టీ అద్యక్షుడు చెరుకు సుధాకర్ నకిరేకల్ నుంచి బరిలోకి దిగుతున్నారని వార్తలు వచ్చాయి. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ నకిరేకల్ సీటుని చిరుమర్తి లింగయ్యకు కేటాయించాల్సిందేనని లేదంటే తాము కూడా పోటీ నుంచి తప్పుకుంటామని బెదిరించడంతో ఆ సీటుని కాంగ్రెస్ అధిష్టానం చిరుమర్తికే సీటుని కేటాయించింది. దీనిపై ఇంటి పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ఈ విషయంలో పాపం కాంగ్రెస్ ది కూడా ఏం చేయలేని పరిస్థితి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

cheraku-sudhakar

కూటమిలోని మిగతా మూడు పార్టీలకు సీట్లు కేటాయించాలి. ప్రతి నియోజకవర్గంలో టిక్కెట్ కోసం ఆశావహులు ఎక్కువగా ఉంటున్నారు. దీంతో నిరసన సెగలు తగులుతున్నాయి. మరి అలాంటి సమయంలో పెద్దగా బలం లేని ఇంటి పార్టీకి టిక్కెట్ కేటాయిస్తే ఇంకేమైనా ఉందా?. నిరసన సెగ తారాస్థాయికి చేరే అవకాశం ఉంది దీనికితోడు నల్గొండలో బలమైన కేడరున్న కోమటిరెడ్డి బ్రదర్స్ ని కాదనంటే రేపు ఎన్నికల్లో ఖర్హ్చు పెట్టాల్సి వస్తే ఎలా ? ఇన్ని సమాలోచనలు చేశాక ఇంటి పార్టీ టిక్కెట్ విషయంలో కాంగ్రెస్ వెనుకడుగు వేసింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇంటి పార్టీ మాత్రం కూటమిలో సీట్ల కేటాయింపు సరిగా జరగలేదంటూ అసహనం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ఇంటి పార్టీ అద్యక్షుడు చెరుకు సుధాకర్ తాజాగా కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. అమరావతి నుంచే కాంగ్రెస్ టిక్కెట్లు వస్తున్నాయని ఆరోపించారు. కూటమి జాబితా అమరావతిలో తయారవుతుందని, ఇంటి పార్టీని మొదటి నుంచి దూరం చేయాలని చూశారని ఆరోపించారు.

Uttamkumar-Reddy

కూటమిలో ఉద్యమకారులకు ద్రోహం జరిగిందని ఆయన అన్నారు. మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాలో రెండు సీట్లు అడిగామని ఆయన చెప్పారు. ఢిల్లీలో బీసీ లీడర్లు పాలెగాళ్లు అయ్యారని కూటమి సీట్లలో సామాజిక న్యాయమే లేదని అన్నారు. సీట్ల జాప్యానికి కోదండరాం, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలే కారణమన్నారు. అయితే మొన్నత్దకా నకరికేల్ నుండి పోటీ చేస్తానన్న ఆయన తాజాగా నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లో తాను పోటీ చేయదలచుకున్నానని తెలిపారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. చెరుకు సుధాకర్ బరిలోకి దిగుతానని చెప్తున్న హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2009లో సుమారు 29వేలు, 2014 ఎన్నికల్లో 23వేల మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పుడు కూడా భారీ మెజారిటీతో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి ఉత్తమ్ మీద పోటీకి సుధాకర్ సిద్ధమయ్యారు. ఇన్ని రోజులు మహాకూటమిలో ఉన్న సుధాకర్ ఇప్పుడు కూటమిలోని పెద్దన్న పార్టీ కాంగ్రెస్ లీడర్ ఉత్తమ్ మీదే పోటీకి సిద్ధమయ్యారు.

mahakutami