ఇద్దరు యువతులు ఆత్మహత్య

ఇద్దరు యువతులు ఆత్మహత్య

మండలంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఒకరు వివాహిత. పోలీసులు తెలిపిన మేరకు… శెట్టూరుకు చెందిన మాల మిద్దె సుధాకర్, రాణిమంజుల దంపతుల చిన్న కుమార్తె సోనియా ఎంటెక్‌ పూర్తి చేసుకుని, అనంతపురంలో ఉంటూ గ్రూప్స్‌కు సిద్ధమవుతోంది. బుధవారం రాత్రి స్వగ్రామానికి వచ్చిన సోనియా.. కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపింది. రాత్రి కుటుంబ సభ్యులందరూ నిద్రపోయాక ఓ గదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

గురువారం ఉదయం ఎంత సేపటికీ సోనియా బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు గది తలుపులు తీసి చూడడంతో సోనియా ఆత్మహత్య విషయం వెలుగు చూసింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ యువరాజ్‌ అక్కడకు చేరుకుని పరిశీలించారు. కాగా, సోనియా మృతికి ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరో ఘటనలో యాటకల్లుకు చెందిన రామాంజినేయులు, రాధమ్మ దంపతుల కుమార్తె ఇందుకు నాలుగు నెలల క్రితం కర్ణాటకలోని కొలిమికెర గ్రామానికి చెందిన వీరేష్‌తో వివాహమైంది. నెల రోజుల క్రితం పుట్టింటికి వచ్చిన ఇందు.. ఆ తర్వాత అత్తారింటికి వెళ్లలేదు. కళాశాలలో చదువుతున్న సమయంలో తాను ప్రేమించిన యువకుడు మృతిచెందాడన్న విషయం తెలుసుకుని తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ క్రమంలోనే ఇందును అత్తారింటికి పంపేందుకు తల్లిదండ్రులు సన్నాహాలు చేస్తుండడంతో మనస్తాపం చెందిన ఆమె గురువారం ఉదయం గ్రామ శివారులోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇందు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.