హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సుకుమార్ కలయికలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతోంది. కేదార్ సెలగంశెట్టి అనే యువ నిర్మాత ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ఫాల్కన్ క్రియేషన్స ఎల్ఎల్పి పతాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా కేదార్ సెలగంశెట్టి ఈ ప్రాజెక్టును ప్రకటించి, మాట్లాడుతూ– ‘‘నాకెంతో ఇష్టమైన విజయ్ దేవరకొండ, సుకుమార్‌గార్లతో నా మొదటి సినిమా చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది.
వీరి కాంబినేషన్ అనగానే చాలా అంచనాలుంటాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వాళ్ల శైలిలోనే ఈ సినిమా ఉంటుంది. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందించనున్నాం. 2022లో సినిమా మొదలవుతుంది. సినిమాల మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చాను. భవిష్యత్‌లో వరుసగా సినిమాలు చేస్తాను’’ అన్నారు.