సినిమాల్లోకి సుమ ఎంట్రీ

సినిమాల్లోకి సుమ ఎంట్రీ

యాంకర్‌ సుమ.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు కూడా ఆమె బాగా సుపరిచితురాలు. పుట్టి పెరిగింది కేర‌ళ‌లో అయినా టాలీవుడ్ బుల్లితెర‌పై రారాణిలా ఓ వెలుగు వెలుగుతున్నారు. యాంకరింగ్‌లో త‌న‌కు సాటి లేరు ఎవరూ అనే విధంగా ముందుకు సాగుతున్నారు. తన మాటలు, పంచ్‌లు, కామెడీ టచ్‌తో యాంకర్‌గా టాలీవుడ్‌లో ఆమె చక్రం తిప్పుతున్నారు. యాంకర్లు ఎంతమంది ఉన్నా సినిమా కార్య‌క్ర‌మాలు, ఆడియో ఫంక్ష‌న్స్‌, ఈవెంట్స్‌ అంటే యాంక‌ర్‌గా సుమ ఉండాల్సిందే అనేలా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారామె.

ఇదిలా ఉంటే బుల్లితెరపై యాంకర్స్‌గా రాణిస్తున్న మేల్‌, ఫీమేల్‌ యాంకర్స్‌ అంతా వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై మెరుస్తున్నారు. శ్రీముఖి, అనసూయ, ప్రదీప్‌, రవి, రష్మీ, సుధీర్‌, వర్షిణీతో పాటు తదితరులు సినిమాల్లో సహా నటీనటులుగా కనిపిస్తున్నారు. కానీ సుమ మాత్రం యాంకరింగ్‌తోనే ఫుల్‌ బిజీగా ఉంటున్నారు. తను లీడ్‌రోల్‌లో ‘కల్యాణ ప్రాప్తిరస్తూ’ అనే మూవీలో నటించిన సుమ ఆ తర్వాత మలయాళం సినిమాల్లో నటించారు. ఆ తర్వాత వర్షం వంటి చిత్రాల్లో సిస్టర్స్‌ పాత్ర పోషించిన సుమ సహా నటిగా అప్పడప్పుడు మెరిసారు.

ఇక చివరిగా ఆమె ఓ బేబీలో టీవీ యాంకర్‌గా కనిపించారు.అయితే పూర్తి స్థాయిలో ఆమె నటించిన సినిమాలు మాత్రం ఈ మధ్య లేవు. ఈ క్రమంలో సుమ త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె వెండితెర రీఎంట్రీపై క్లారిటీ వచ్చింది. దీనిపై సుమ ఓ వీడియో ద్వారా తనదైన శైలిలో స్పష్టత ఇచ్చారు.

పలువురు సెలబ్రిటీలు తన గురించి మాట్లాడిన వీడియో క్లిప్స్ కట్ చేసి ఓ వీడియో రెడీ చేసి.. ‘ఇంతమంది అడుగుతున్నారంటే చేసేస్తే పోలే’ అంటూ సుమ చెప్పుకొచ్చారు. ఈ వీడియో పీఆర్‌ఓ దుద్ది శ్రీను తన ట్విటర్‌లో పంచుకున్నాడు. మరి సుమ ఎలాంటి పాత్రతో రీఎంట్రీ ఇవ్వ‌నుంద‌నేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఎప్పుడూ తన యాంకరింగ్‌ సరికొత్త ఉండాలనుకునే సుమ సినిమా విషయంలో ఏమాత్రం తగ్గదని, తను ఓ మంచి పాత్రతోనే ఫ్యాన్స్‌ అలరిస్తారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.