రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. రాజస్తాన్ నిర్దేశించిన 155 పరుగుల టార్గెట్‌ను 18.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆరెంజ్ ఆర్మీలో డేవిడ్ వార్నర్(4), బెయిర్ స్టో(10)లు నిరాశపరిచినా మనీష్ పాండే(83 నాటౌట్; 47 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), విజయ్ శంకర్( 52 నాటౌట్; 51 బంతుల్లో 6 ఫోర్లు)లు మరో వికెట్ పడకుండా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. తొలి మూడు ఓవర్లలోపే వార్నర్, బెయిర్ స్టో వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును మనీష్ పాండే, విజయ్ శంకర్లు ఆదుకున్నారు.
వార్నర్, బెయిర్ స్టోలను ఆదిలోనే జోఫ్రా ఆర్చర్ ఔట్ చేసి గట్టి దెబ్బకొట్టాడు. కానీ మనీష్ పాండే, విజయ్ శంకర్లు సమయోచితంగా ఆడటంతో లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు. ముఖ్యంగా మనీష్ పాండే చెలరేగి ఆడాడు. ఫోర్లు, సిక్స్‌లతో బౌండరీల మోత మోగించాడు. దాంతో ఎస్ఆర్హెచ్ తిరిగా గాడిలో పడింది. మనీష్‌కు విజయ్ శంకర్ నుంచి చక్కటి సహకారం లభించడంతో ఎస్ఆర్హెచ్కు తిరుగులేకుండా పోయింది. ఈ జోడి అజేయంగా 140 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఎస్ఆర్హెచ్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. ఆరంభంలో మినహా ఏ దశలోనూ రాజస్తాన్ నుంచి ఎస్ఆర్హెచ్కు పోటీ ఎదురుకాలేదు. ఈ మ్యాచ్‌లో విజయంతో తొలి అంచె మ్యాచ్‌లో రాజస్తాన్‌పై ఓటమికి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. ఇది సన్‌రైజర్స్‌కు నాల్గో విజయం కాగా, రాజస్తాన్‌కు ఏడో ఓటమి.
ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడంతో రాజస్తాన్ బ్యాటింగ్‌కు దిగింది. రాజస్తాన్ రాయల్స్‌ను రాబిన్ ఊతప్ప, బెన్ స్టోక్స్‌లు ఆరంభించారు. కాగా, రాజస్తాన్ ఇన్నింగ్స్ నాల్గో ఓవర్ మూడో బంతికి ఊతప్ప(19; 13 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్) రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత బెన్ స్టోక్స్-సంజూ శాంసన్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ 56 పరుగులు జత చేసిన తర్వాత శాంసన్(36; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్) ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్ దూకుడుగా వెళ్లకుండా నెమ్మదిగా ఆడాడు. (కోహ్లి రెండు పరుగులు.. వాటిని పరిగణిస్తారా?)
కాగా, హోల్డర్ వేసిన 12 ఓవర్లో నాల్గో బంతికి శాంసన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో రాజస్తాన్ 86 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. అదే స్కోరు వద్ద స్టోక్స్(30; 32 బంతుల్లో 2ఫోర్లు) పెవిలియన్ చేరాడు. రషీద్ ఖాన్ వేసిన 13 ఓవర్ తొలి బంతికి స్టోక్స్ బౌల్డ్ అయ్యాడు. జోస్ బట్లర్(9), స్టీవ్ స్మిత్(19)లు నిరాశపరిచారు. విజయ్ శంకర్ బౌలింగ్‌లో బట్లర్ ఔట్ కాగా, హోల్డర్ బౌలింగ్‌లో స్మిత్ ఔటయ్యాడు. హోల్డర్ వేసిన 19 ఓవర్ తొలి బంతికి భారీ షాట్‌కు యత్నించిన స్మిత్.. బౌండరీ లైన్ వద్ద మనీష్ పాండే క్యాచ్ పట్టడంతో నిష్క్రమించాడు.
అదే ఓవర్ రెండో బంతికి రియాన్ పరాగ్(20; 12 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్) ఔటయ్యాడు. భారీ షాట్ ఆడే యత్నంలో వార్నర్ క్యాచ్ పట్టడంతో పరాగ్ ఔటయ్యాడు. చివర్లో జోఫ్రా ఆర్చర్(16 నాటౌట్; 7 బంతుల్లో 1 ఫోర్, 1సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో 150 పరుగుల మార్కును దాటింది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన జేసన్ హోల్డర్ మూడు వికెట్లతో మెరిశాడు. విలియమ్సన్ స్థానంలో జట్టులోకి వచ్చిన హోల్డర్ తనపాత్రకు న్యాయం చేసి రాజస్తాన్‌ను కట్టడి చేయడంలో సహకరించాడు. విజయ్ శంకర్, రషీద్ ఖాన్లు తలో వికెట్ తీశారు.