గత ఆరు నెలలుగా కొనసాగుతున్న పంజాబ్ రాజకీయ సంక్షోభం మంగళవారం కొత్త మలుపు తిరిగింది. ఊహించని విధంగా పంజాబ్ పీసీసీ పదవికి నవజ్యోత్ సింగ్ రాజీనామా చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై తిరుగుబాటు చేసి, ఆయన సీఎం పీఠం నుంచి దిగిపోయేవరకూ నవజ్యోత్ సింగ్ నిద్రపోలేదు. గతవారమే అమరీందర్ రాజీనామాతో కొత్త ముఖ్యమంత్రిగా దళిత నేత చరణ్‌జీత్ సింగ్ ఛన్నీని కాంగ్రెస్ నియమించింది.
‘ఒక వ్యక్తి పాత్ర పతనం రాజీ మూలలో నుంచి పుడుతుంది.. పంజాబ్ భవిష్యత్తు, పంజాబ్ సంక్షేమం కోసం ఎజెండా విషయంలో నేను రాజీపడలేను.. అందువల్ల నేను పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను.. ఎప్పటికీ కాంగ్రెస్‌కి సేవ చేస్తూనే ఉంటాను’ అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన తన రాజీనామా లేఖలో సిద్ధూ పేర్కొన్నారు. మరో ఐదు నెలల్లోనే పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా.. కాంగ్రెస్‌కు ఈ పరిణామం ఓ రకంగా మింగుడపడని అంశమే.
అయితే, సిద్ధూకు పీసీసీ పగ్గాలు అప్పగించవద్దని గాంధీలను పలువురు కాంగ్రెస్ పెద్దలు హెచ్చరించారు. వారి హెచ్చరికలు తోసిరాజని సిద్ధూను పీసీసీ పీఠంపై కూర్చోబెట్టడంలో ప్రియాంకా గాంధీ వాద్రా కీలకంగా వ్యవహరించారు. తాజా పరిణామాలతో ప్రస్తుతం సిమ్లా పర్యటనలో ఉన్న సోనియా, రాహుల్ గాంధీలు హుటాహుటీన ఢిల్లీకి బయలుదేరారు. సిద్ధూకు అత్యంత సన్నిహితుడైన పంజాబ్ కొత్త సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీకి ఆయన రాజీనామా షాక్ అనే చెప్పుకోవాలి.
కొన్ని నిర్ణయాలలో సిద్దూ ‘సూపర్ ముఖ్యమంత్రి’గా వ్యవహరిస్తున్నప్పటికీ, వివాదాస్పదంగా కనిపించిన ఇటీవలి అత్యున్నత నియామకాలలో ఆయనను పట్టించుకోలేదు. ఇసుక తవ్వకాల వేలంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్న రాణా గుర్జిత్ సింగ్‌కు క్యాబినెట్లో అవకాశం కల్పించడంపై నవజ్యోత్ సింగ్ సిద్ధూ నిరసన తెలిపినట్టు తెలుస్తోంది. మాజీ డీజీపీ సుమేధ్ సైనీ స్టాండింగ్ కౌన్సిల్లో ఉన్న APS డియోల్‌ను అడ్వకేట్ జనరల్‌గా నియమించడాన్ని వ్యతిరేకించినట్టు సమాచారం.
ఇక, సిద్ధూ రాజీనామాపై మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ వ్యంగ్యంగా స్పందించారు. ‘ఆయనకు స్థిరత్వంలేదని ముందే చెప్పాను.. సరిహద్దు రాష్ట్రం పంజాబ్‌కు ఆయన సరై వ్యక్తి కాదు’ అని ట్వీట్ చేశారు. సిద్ధూ నాయకత్వంలోనే పంజాబ్ ఎన్నికలను ఎదుర్కొంటామని గతవారం ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి ఇది పెద్ద షాక్. జులైలోనే సిద్ధూ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన విషయం తెలిసిందే.