Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ మహేష్ తాను, తన సినిమాలు తప్ప ఇంకో సంగతి పట్టించుకోని హీరో. ఆయన్ని ఎవరు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా సంయమనంతో వుండే మనిషి. అందుకే తండ్రి కృష్ణ దగ్గర నుంచి బావ గల్లా జయదేవ్ దాకా ఎందరు ప్రయత్నించినా మహేష్ రాజకీయాలకి దూరంగా వుంటూ వచ్చారు. అయితే కుటుంబ సభ్యులు ఎవరైనా ఎన్నికల్లో నిలబడితే పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా వారిని ఏ ట్విట్టర్ ద్వారానో బలపరచడానికో మహేష్ పరిమితం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి అలా చెప్పడానికి కూడా వీల్లేకుండా మహేష్ కి పెద్ద సమస్య వచ్చిపడేలా వుంది.
మహేష్ కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులు, రెండు పార్టీల తరపున పక్క పక్క లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. మహేష్ బావ గల్లా జయదేవ్ ఈసారి కూడా గుంటూరు నుంచి టీడీపీ టికెట్ మీద ఎంపీ గా పోటీ చేసే అవకాశం వుంది. ఇక విజయవాడ లోక్ సభ స్థానం నుంచి వైసీపీ టికెట్ కోసం బ్రహ్మోత్సవం నిర్మాత పీవీపీ గట్టి గా ట్రై చేస్తున్నారు.
ఆయనకు ఆర్ధిక బలం ఉన్నప్పటికీ ఆ స్థానాన్ని పీవీపీ కి ఇవ్వడానికి జగన్ సిద్ధంగా లేరట. పైగా ఆ స్థానంలో మహేష్ బాబాయ్ ఆదిశేషగిరిరావు ను నిలబెట్టాలని జగన్ అనుకుంటున్నారట. తద్వారా గుంటూరు, విజయవాడ లో కమ్మ ఓట్లు చీల్చాలని ప్లాన్ చేస్తున్నారు. రాజకీయాల్లో ఇదంతా సహజమే గానీ వీరు రేపు టికెట్స్ రాగానే ఓ అనుకూల ప్రకటన ఇమ్మని మహేష్ ని అడగడం ఖాయం. ఎవరైనా ఒకరు అయితే ఓకే గానీ ఒకే ఎన్నికల్లో వేర్వేరు పార్టీల తరపున పోటీ చేస్తున్న ఇద్దరికీ మద్దతు అంటే జనం ఏమనుకుంటారో అన్న సందేహం. మొత్తానికి బావ, బాబాయ్ , మధ్యలో నిర్మాత తో మహేష్ కి 2019 ఎన్నికలు ఓ అగ్నిపరీక్షే.