పెంచి పెద్ద చేసిన త‌ల్లికి రూ. 6కోట్లు ఇవ్వాలిః తైవాన్ సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు

Supreme Court asks the son to pay Rs. 6+ crores to his mother
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

న‌వ‌మాసాలు మోసీ, పురిటినొప్పులు త‌ట్టుకుని, పిల్ల‌ల్ని క‌నిపెంచే త‌ల్లి ప్రేమ‌కు విలువ‌క‌ట్ట‌గ‌ల‌మా…? త‌ల్లి రుణం తీర్చ‌లేనిద‌ని ఒక్క మాటంటే కృత‌జ్ఞ‌త తీరిపోతుందా…? ఆమె ప‌డిన క‌ష్టానికి ఫ‌లితం ల‌భిస్తుందా…. పిల్ల‌ల్ని పెంచిపెద్ద చేసేట‌ప్పుడు త‌ల్లులు నిజానికి ఏమీ ఆలోచించరు. వారు భ‌విష్య‌త్తులో త‌మ‌ను చూస్తారా లేదా…, వృద్ధాప్యంలో చేర‌దీస్తారా వంటి ఆలోచ‌ల‌నేవీ ఉండ‌వు. ఏ స్వార్థ‌మూ లేకుండా..భ‌విష్య‌త్ ప్ర‌యోజ‌నాల గురించి ఏమీ ఆలోచించ‌కుండా త‌మ బాధ్య‌త‌ను ఇష్టంతో నెర‌వేరుస్తారు.

పిల్ల‌లు జీవితంలో స్థిర‌ప‌డేదాకా అలుపెర‌గ‌కుండా శ్ర‌మిస్తారు. త‌ల్లి జీవితం మొత్తం పిల్ల‌ల‌చుట్టూనే తిరుగుతుంది. వారి బాగోగులు చూడ‌డంలోనే జీవితంలో ముఖ్య‌భాగం గ‌డిచిపోతుంది. అలా త‌ల్లిచేతిలో పెరిగి పెద్ద‌యిన‌వారికి త‌ర్వాతి రోజుల్లో ఆ త‌ల్లే భారంగా క‌నిపిస్తుంటుంది. ఆమె బాగోగులు చూడడ‌డం…ఖ‌ర్చుతో కూడుకున్న వ్య‌వ‌హారం అనిపిస్తుంటుంది. ఆ బాధ్య‌త‌ను భుజాన వేసుకోవ‌డం క‌ష్టంగా మారుతుంది. కుల‌,మ‌త‌,ప్రాంత తేడాల్లేకుండా అన్నిచోట్లా ప్ర‌స్తుత రోజుల్లో ఇలాంటి ప‌రిస్థితులే క‌నిపిస్తున్నాయి.

జీవితాన్నంతా పిల్ల‌ల కోసం వెచ్చించి వృద్ధాప్యంలో మాత్రం నా అనేవారు లేక‌, ఆర్థిక ఆలంబ‌న లేక ఎంద‌రో త‌ల్లులు దుర్భ‌ర‌జీవితం గ‌డుపుతున్నారు. అలాంటి ప‌రిస్థితి రాకుండా ఉండాలంటే…పిల్ల‌లు పెరిగి పెద్ద‌యి ఆర్థికంగా స్థిర‌ప‌డిన త‌ర్వాత వారి సంపాద‌న‌లో కొంత మొత్తం క‌చ్చితంగా త‌ల్లిదండ్రుల‌కు చెందేలా ఓ చ‌ట్టం చేయాల‌న్న అభిప్రాయం ఎప్ప‌టినుంచో విన‌ప‌డుతోంది. అది మ‌న దేశంలో ఎప్పుడు కార్య‌రూపం దాల్చుతుందో తెలియ‌దు కానీ…తైవాన్ మాత్రం త‌ల్లి ప్రేమ‌కు వెల‌క‌ట్టింది.

జీవిత‌మంతా పిల్ల‌ల కోసం ప‌డిన క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం ద‌క్కాల‌ని ఓ కేసులో ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వ‌డం ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మ‌యింది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే…తైవాన్ కు చెందిన లో అనే మ‌హిళ 1990లో భ‌ర్త‌తో విడాకులు తీసుకుంది. అనంత‌రం త‌న ఇద్ద‌రు కుమారుల‌ను పెంచిపెద్ద చేసింది. వారికి ఏ లోటూ రాకుండా ఉన్న‌త చ‌దువులు చ‌దివించింది. త‌ల్లి కోరుకున్న విధంగా పిల్ల‌లిద్ద‌రూ ఆర్థికంగా ఉన్న‌త‌స్థానానికి ఎదిగారు. అయితే భ‌ర్త నుంచి విడిపోయిన త‌ర్వాత ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌కోర్చి పిల్ల‌లను పెంచిన ఆమె భ‌విష్య‌త్తులో తాను ఎలాంటి ఇబ్బందులూ ప‌డ‌కూడ‌ద‌ని ఓ ముందు జాగ్ర‌త్త తీసుకుంది.

పిల్ల‌లు 20 ఏళ్ల వ‌య‌సులో ఉన్న‌ప్పుడు వారు భ‌విష్య‌త్తులో సాధించే లాభాల్లో 60శాతం త‌న‌కుచెందేలా ఒప్పంద‌ప‌త్రం రాయించుకుంది. కొన్నాళ్ల‌కు ఆమె భ‌య‌ప‌డిందే జ‌రిగింది. వృద్ధురాలైన ఆమెను కుమారులిద్ద‌రూ ప‌ట్టించుకోవ‌డం మానేశారు. దీంతో క‌ల‌త చెందిన ఆమె కొడుకులను సంప్ర‌దించింది. పెద్ద కొడుకు ఒప్పందం ప్రకారం అనుకున్న మొత్తం ఇచ్చేశాడు. కానీ రెండో కుమారుడు మాత్రం కోర్టుకు వెళ్లాడు. పిల్ల‌ల్ని పెంచ‌డం త‌ల్లిదండ్రుల బాధ్య‌త‌ని, పిల్ల‌ల‌తో ఇలాంటి ఒప్పందాలు చేసుకుని సంప్ర‌దాయాల‌కు త‌న త‌ల్లి భంగం క‌లిగిస్తోంద‌ని పిటిష‌న్ వేశాడు.

తీర్పు కూడా ఆయ‌న‌కే అనుకూలంగా వ‌చ్చింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్ర‌యించగా…అత్యున్న‌త న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. కొడుకులిద్ద‌రూ మేజ‌ర్ల‌యిన త‌ర్వాతే ఒప్పందం జ‌రిగింద‌ని, అంతేకాకుండా ఆ మొత్తాన్ని చెల్లించే స్తోమ‌త అత‌డికి ఉంద‌ని, వెంట‌నే రూ. 6కోట్లు ఇవ్వాల‌ని సుప్రీం తీర్పు ఇచ్చింది. తైవాన్ లో పిల్ల‌లు వృద్ధ త‌ల్లిదండ్రుల్ని వ‌దిలేస్తున్న కేసులు రోజురోజుకూ ఎక్కువ‌వుతున్న త‌రుణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వ‌ల్ల ఎంద‌రో వృద్ధ త‌ల్లిదండ్రుల‌కు న్యాయం చేకూరుతుంది.