దిశ హత్య కేసుకు సంబంధించి నలుగురు నింధితులను పోలీసులు ఎన్కౌంటర్లో చంపిన సంగతి తెలిసిందే. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితులను దిశను చంపిన సంఘటన స్థలం చటాన్‌పల్లి వద్దకు తీసుకుని వెళ్ళగా వారు పోలీసులపై దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఎన్కౌంటర్ చేసి చంపేశారు.
అయితే ఈ ఎన్కౌంటర్ జరిగి దాదాపు వారం రోజులు కావస్తున్నా నిందితుల డెడ్ బాడీలకు ఇంకా అంత్యక్రియలు జరగలేదు. ఈ ఎన్‌కౌంటర్‌పై సిట్ విచారణ జరుగుతున్న నేపధ్యంలో నిందితుల మృతదేహాలను భద్రపరచాల్సిందేనని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు నిన్న న్యాయ విచారణ జరిపి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలో త్రిసభ్య కమీషన్ ఏర్పాటు చేసింది. ఈ కేసు విచారణపై తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఈ కమీషన్‌కు సహకరించాలని సుప్రీం కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మృతదేహాల అప్పగింతపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తెలిపింది. దీనితో అంత్యక్రియలు మరింత ఆలస్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.