Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎంతో మంది ముస్లిం మహిళల జీవితాల్లో అంధకారం నింపిన మూడుసార్లు తలాక్ నిబంధనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మూడుసార్లు తలాక్ చెప్పి భార్యకు విడాకులిస్తాననటం రాజ్యాంగ విరుద్ధమని, ఈ పద్ధతి చెల్లదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. తలాక్ ను నిషేధిస్తున్నామని ఆదేశాలిచ్చింది. ఖురాన్ నియమాలకు తలాక్ వ్యతిరేకంగా ఉందని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనిపై పార్లమెంటులో ఆరు నెలల్లోగా చట్టం తీసుకురావాలని , అప్పటివరకూ నిషేధం విధిస్తున్నామని స్పష్టంచేసింది. ఐదు భిన్నమతాలకు చెందిన న్యాయమూర్తులు ఈ కేసును విచారించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహార్ సిక్కు మతస్థులు కాగా, న్యాయమూర్తులు జస్టిస్ కురియన్ క్రిస్టియన్ వర్గానికి, జస్టిస్ నారిమన్ పార్శీ మతానికి, జస్టిస్ లలిత్ హిందూ వర్గానికి, జస్టిస్ అబ్దుల్ నజీర్ ముస్లిం మతానికి చెందిన వారు. ఐదుగ్గురు న్యాయమూర్తుల్లో ముగ్గురు కురియన్, లలిత్, నారీమన్ మూడుసార్లు తలాక్ చెప్పటాన్ని వ్యతిరేకించారు. ఇస్లాం దేశాల్లోనే దీన్ని నిషేధించినప్పుడు భారత్ లో కొనసాగించాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహార్, జస్టిస్ నజీర్ మాత్రం ఈ విషయాన్ని పార్లమెంట్ కే వదిలేస్తున్నట్టు చెప్పారు. దశాబ్దాల నాటి ఈ ఆచారంపై న్యాయస్థానం జోక్యం చేసుకోబోదన్నారు. ఐదుగురు న్యాయమూర్తులు పార్లమెంట్ దీనిపై చట్టం తేవాలన్న విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. చట్టం వచ్చేంత వరకు దీనిపైఎలాంటి పిటీషన్లు తీసుకోబోమని స్పష్టంచేశారు. ఆరునెలల్లోపు చట్టం రాకపోతే నిషేధం ఆ తర్వాతా కొనసాగుతుందని తెలిపారు. షరియా చట్టాలను, ముస్లిం సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని చట్టం చేయాలని కేంద్రానికి న్యాయమూర్తులు సూచించారు. రాజకీయ పక్షాలు కూడా సహకరించాలని కోరారు. 1400 ఏళ్లనాటి మూడుసార్లు తలాక్ మతాచారం సాంకేతిక యుగంలో వెర్రితలలు వేసింది. వాట్సాప్, సోషల్ మీడియా, పోస్ట్‌కార్డు, న్యూస్ పేపర్ ద్వారా మూడు సార్లు తలాక్ చెప్పేసి భార్యకు విడాకులిస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. దీంతో తలాక్ కు వ్యతిరేకంగా కొంతమంది సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆగ్రహం వ్యక్తంచేసింది. మత సంబంధ వ్యవహారాలపై కోర్టులు జోక్యం చేసకోవటం సరికాదని విమర్శించింది. అయితే ముస్లిం లతో పాటు…అనేక వర్గాల నుంచి తలాక్ కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తులు అందాయి. ..చివరకు అత్యున్నత న్యాయస్థానంపై తలాక్ పై నిషేధం విధిస్తూ సంచలన తీర్ప వెలువరించింది.
మరిన్ని వార్తలు: