విద్యార్ధికి సుప్రీంకోర్టు సాయం

విద్యార్ధికి సుప్రీంకోర్టు సాయం

సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తన విశేష అధికారాలను ఉపయోగించి, చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. విద్యార్హతలున్నవాళ్లకు అవకాశాలు దక్కడంలో అవాంతరాలు ఎదురైతే తాము చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసింది. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఓ దళిత విద్యార్థికి కేసులో సోమవారం ఈ ఉత్తర్వులు జారీచేసింది. సాంకేతిక కారణాలతో ఐఐటీలో సీటు దక్కకపోవడంతో విద్యార్థి బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ పిటిషన్‌ తిరస్కరణకు గురికావడంతో ఆ విద్యార్ధి సుప్రీంకోర్టు మెట్లెక్కాడు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం.. బాంబే హైకోర్టు తీర్పుపై విచారం వ్యక్తం చేసింది. అతనికి సీటు ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర ప్రదేశ్‌ ఘజియాబాద్‌కు చెందిన ప్రిన్స్‌ జైబీర్‌సింగ్‌ ఐఐటీ 2021 ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌లో 25, 894వ ర్యాంక్‌ సాధించాడు.

కౌన్సెలింగ్‌లో బాంబే ఐఐటీలో సీటు కోసం ఆప్షన్‌ పెట్టుకున్నాడు. ఆ కుటుంబం నుంచి ఉన్నత విద్యకు అభ్యసించబోయే మొదటి వ్యక్తి కావడంతో వారు సంబురాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సివిల్ ఇంజినీరింగ్‌లో కోసం దరఖాస్తు చేయగా.. అక్టోబరు 27న సీటు కేటాయించింది. ఫీజు చెల్లించడానికి తుది గడువు అక్టోబరు 31గా నిర్దేశించింది.

అక్టోబరు 29న బాంబే ఐఐటీ పోర్టల్‌లో లాగిన్ అయి అవసరమైన ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేశాడు. అయితే, ఆర్థిక ఇబ్బందులతో రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 15వేలను చివరి నిమిషంలో ప్రిన్స్ చెల్లించాడు. ఆ సమయానికి సాంకేతిక కారణాల వల్ల పేమెంట్‌ జరగకపోవడంతో 10 నుంచి 12 సార్లు ప్రయత్నించాడు. దీంతో అతనికి సీటు కన్ఫర్మ్ కాలేదు. ఈ సమస్యపై కౌన్సిలింగ్‌ నిర్వహించిన ఖరగ్‌పూర్‌ ఐఐటీని ప్రిన్స్ వెంటనే ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో బాంబే హైకోర్టులో పిల్ దాఖలు చేయగా.. అక్కడా నిరాశే ఎదురయ్యింది. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో సీటు లభించింది.

‘‘జరిగింది సాంకేతిక తప్పిదం.. విద్యార్థి తప్పేం లేదు.. పైగా మంచి భవిష్యత్తు ఉన్న ఓ యువ దళిత విద్యార్థికి ఫీజు కారణంగా సీటు నిరాకరించడం బాధాకరం.. ఇక్కడ కూడా అతడికి న్యాయం జరగకపోతే.. న్యాయ్యాన్నే అపహాస్యం చేసిన వాళ్లమవుతాం.. తక్షణమే బాంబే ఐఐటీలో అతడికి సీటు కేటాయించాలి.. మిగతా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా.. అవసరమైతే ఇతని కోసం ఓ సీటును సృష్టించండి.. 48 గంటల్లో అందుకు బంధించిన పత్రాలను కోర్టుకు సమర్పించాలి ’’ అని  ఆదేశించింది.

మానవతా దృక్ఫథంతో ఒక్కోసారి న్యాయ పరిధిని దాటి ఆలోచించాల్సి వస్తుందని, ఈ కేసులోనూ విద్యార్థి కోసం తాము అదే కోణంలో తీర్పు ఇస్తున్నామని జస్టిస్‌ చంద్రచూడ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తమ విచక్షణాధికారాన్ని సుప్రీంకోర్టు ఉపయోగించి ఆదేశాలు జారీ చేయొచ్చు. ఈ ఆదేశాలను తప్పనిసరిగా అమలుచేయాలి . ప్రస్తుత కేసులో ఈ ఆర్టికల్‌ ఆధారంగా తక్షణమే ఆదేశాలు అమలయ్యేలా చూడాలని జోసాను ఆదేశించింది.