పరంబీర్‌ సింగ్‌కు సుప్రీంకోర్టులో ఊరట

పరంబీర్‌ సింగ్‌కు సుప్రీంకోర్టులో ఊరట

అవినీతి ఆరోపణల కేసులో ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌కు సోమవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. అదే సమయంలో కేసుల దర్యాప్తునకు తప్పనిసరిగా హాజరుకావాలని పరంబీర్‌ను ఆదేశించింది. ముంబయి సీపీగా ఉన్నప్పుడు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పరంబీర్‌ సింగ్‌ గత కొన్ని నెలలుగా అజ్ఞాతంలో ఉన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయన దేశం విడిచి పారిపోయారనే ఆరోపణలు వచ్చాయి. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ గతవారం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాగా.. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆయన ఎక్కడున్నారో చెప్పాలని డిమాండ్ చేసింది. ‘మిస్టర్ పరంబీర్ సింగ్ ఎక్కడ.. ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఆయన ఉన్నారు’ అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆయన ఎక్కడున్నారో చెప్పాలని, ఆ తర్వాతే పిటిషన్‌పై విచారిస్తామని స్పష్టం చేసింది.

తాజాగా, పరంబీర్‌ ఎక్కడికీ పారిపోలేదని, దేశంలోనే ఉన్నారని ఆయన తరఫు లాయర్ సోమవారం కోర్టుకు తెలియజేశారు. ‘‘పరంబీర్‌ పారిపోవాలనుకోవడం లేదు.. ఆయన ఎక్కడికీ వెళ్లలేదు.. దేశంలోనే ఉన్నారు.. అయితే ఆయన మహారాష్ట్రలోకి అడుగుపెడితే ముంబయి పోలీసుల నుంచి ఆయనకు ముప్పు పొంచి ఉంది. ఆయనపై తప్పుడు కేసులు పెట్టారు.. అందుకే అరెస్టు నుంచి రక్షణ కోరుతున్నాం.. 48 గంటల్లో సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు’’ అని పరంబీర్‌ తరఫు లాయర్ తెలిపారు.

ఈ వాదనలు విన్న జస్టిస్ ఎస్కే కౌల్ ధర్మాసనం.. పరంబీర్‌కు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. అయితే, తప్పనిసరిగా దర్యాప్తునకు హాజరుకావాలని ఆదేశించింది. అలాగే, పరంబీర్ పిటిషన్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబరు 6వ తేదీకి వాయిదా వేసింది. రూ.15కోట్ల కోసం పరంబీర్‌, మరో ఐదుగురు పోలీసులు తనను వేధించారంటూ ఈ ఏడాది జులైలో ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు ఆయనపై మరో మూడు కేసులు కూడా నమోదయ్యాయి.

ఈ కేసుల విచారణలో భాగంగా ముంబయి పోలీసులు పరంబీర్‌కు నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేశారు. అయితే, అక్టోబరు 1 నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పరంబీర్‌ను పరారీలో ఉన్న నేరస్థుడిగా బాంబే మెజిస్ట్రేట్‌ కోర్టు ఇటీవల ప్రకటించింది.